Hyderabad: గ్లోబల్ సమ్మిట్, పంచాయతీ ఎన్నికలు.. తెలంగాణ పోలీసుల ముందు మరో ఛాలెంజ్.. !
ఓవైపు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు తెలంగాణ పంచాయతి ఎన్నికల ముందు తెలంగాణ పోలీసులకు మరో ఛాలేంజ్ ఎదురైంది. ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఈ నెల 13న ఫుడ్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులు డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగబోయే ఫుడ్‌బాల్ మ్యాచ్‌కు సంబంధించిన భద్రాతా ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సికి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్ దృష్ట్యా, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకోసం మెట్రో రైళ్లలోనూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలియజేయాలని డిజిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా, అధికారులు ఉప్పల్ స్టేడియం భద్రతాపరమైన అనుకూలతలను డిజిపి కి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, సెక్యూరిటీ పరంగా చాలా అనువైనదని వారు తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే నాలుగు ప్రధాన సెక్టర్లుగా విభజించడం జరిగిందని, దాదాపు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఈ ప్రాంగణానికి ఉందని వివరించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎటువంటి లోపాలు లేకుండా, విజయవంతంగా నిర్వహించాలని డిజిపి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
