Vande Bharat Express: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు.. రూట్ ఖరారు.. పూర్తి వివరాలు.!
సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి. ఇప్పుడు మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఒకటి సికింద్రాబాద్-విశాఖ కాగా, ఇంకొటి సికింద్రాబాద్-తిరుపతి. ఇప్పుడు మరో వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుంచి నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య వాణిజ్యపరమైన అంశాలు భారీగా సాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మొత్తం 25 రైళ్లు నడుస్తున్నాయి. అన్నీ ఎక్స్‌ప్రెస్‌లే గానీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు.
నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581కి.మీ ఉంది. ఈ దూరాన్ని కవర్ చేయడానికి 10 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు కొత్తగా వందేభారత్ రైలును ప్రవేశపెట్టి 10 గంటల సమయాన్ని 6.30 గంటలకు తగ్గించాలని ప్రయత్నిస్తోంది భారతీయ రైల్వే శాఖ. ఈ వందేభారత్ రైలుకు సంబంధించిన రూట్‌ను కూడా ఖరారు చేశారు రైల్వే శాఖ అధికారులు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా మీదుగా నడవనుంది. అలాగే ఉదయం 6 గంటలకు నాగ్‌పూర్ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్.. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి.. రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుందని రైల్వే అధికారులు అనధికారికంగా తెలిపారు. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.