Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu – Revanth Reddy: బిగ్ డే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై ఉత్కంఠ.. విభజన సమస్యలకు చెక్‌ పడుతుందా?

తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్‌ డే.. విభజన సమస్యలకు చెక్‌ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..? CMల ఫస్ట్‌ మీటింగ్‌లో జరిగేదేంటి? అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చర్చించబోతున్నారు. ఇదివరకటి ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

Chandrababu - Revanth Reddy: బిగ్ డే.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై ఉత్కంఠ.. విభజన సమస్యలకు చెక్‌ పడుతుందా?
Chandrababu Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 06, 2024 | 4:11 PM

తెలుగు రాష్ట్రాలకు ఇవాళ బిగ్‌ డే.. విభజన సమస్యలకు చెక్‌ పడుతుందా? జలాలవాటా నుంచి ఆస్తుల పంపకాల దాకా.. అన్ని కొలిక్కి వస్తాయా..? CMల ఫస్ట్‌ మీటింగ్‌లో జరిగేదేంటి? అనేది.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. రెండు రాష్ట్రాల విభజన అంశాలను తేల్చేయడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చర్చించబోతున్నారు. ఇదివరకటి ముఖ్యమంత్రుల సమావేశానికి, ఈ సమావేశానికి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన.. పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. మళ్లీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకచకా జరిగిపోయాయి.. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా.. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

తొలిసారి విభజన అంశాలపై చర్చించేందుకు ప్రజాభవన్‌లో సాయంత్రం 6గంటలకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశంకానున్నారు.. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, ఇరు రాష్ట్రాల్లో సీఎస్‌లు, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరవుతారు.

మొత్తం పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి.. వీటిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది..

షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ జరగనుంది.. 9వ షెడ్యూల్‌లో పెండింగ్‌లో 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్‌లో పెండింగ్‌లోని 30 సంస్థల పంపిణీ గురించి చర్చించనున్నారు.

షీలా బీడే కమిటీ సిఫార్సులపై కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చ జరగనుంది.

ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరగనుంది..

ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన సమస్యలు కొలిక్కిరాకపోవడంతో.. పలు సంస్థలకు చెందిన రూ. 8,000 కోట్లను రెండు రాష్ట్రాలు వినియోగించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది.. దీనిపై చర్చజరగనుంది..

9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపి జెన్కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారించారు. అత్యల్పంగా ఏపి మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది..

10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను ఏపి తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పంచుకున్నాయి.. రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు.. కావున విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల విభజనపై సీఎంల సమీక్ష జరగనుంది.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇవే..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి.

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా టీ.టీ.డీ. పాలకవర్గంలో ప్రాధాన్యత , టిటిడి దర్శనాలలో తెలంగాణ స్పెషల్ కోటా డిమాండ్..

కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలి.

తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుంది.

తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్‌లలో తెలంగాణకు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ కు తెలంగాణకు కోటా ఇవ్వాలి..

డిన్నర్ ఏర్పాటు..

కాగా.. ఇవాళ సాయంత్రం ప్రజా భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డిన్నర్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు సమావేశంలో పాల్గొనే వారికి కూడా డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..