Hyderabad: భాగ్యనగరంలో తీవ్రంగా పడిపోయిన గాలి నాణ్యత
హైదరాబాద్‌లో దీపావళి సంబరాలు దుమ్ము లేచిపోయాయి. చెడుపై మంచి గెలుపుకు సూచికగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ప్రజలు. అయితే క్రాకర్స్ కాల్చడం వల్ల గాలి నాణ్యత కూడా పడిపోయింది. పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా గాలి నాణ్యత ఉన్నట్లు డేటా వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...

దీపావళి వేడుకల్లో భాగంగా పేలుతున్న టపాసులతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘అనారోగ్యకరమైన స్థాయి’కి చేరుకుంది. IQAir డేటా ప్రకారం, నగరంలో మొత్తం గాలి నాణ్యత 161గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో PM 2.5 పార్టికల్స్ సాంద్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కన్నా 17.2 రెట్లు అధికంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సూచనల ప్రకారం గాలిలో PM 2.5 స్థాయికి మించితే పరిస్థితి ఆందోళణకరంగా మారినట్లే. ఈ గాలి లంగ్స్‌లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు (బ్రాంకైటీస్), గుండె స్పందనలో వ్యత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.
హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) నుంచి వచ్చిన డేటా ప్రకారం, నగరంలోని పదిహేను కాలుష్య చెకింగ్ పాయింట్లలో… US కాన్సులేట్ స్టేషన్ అత్యధిక AQI సూచిక (341) నమోదు అయ్యింది. ఇక్కడ అన్ని ప్రాంతాల కంటే అత్యంత అనారోగ్యకరమైన గాలి ఉన్న ప్రాంతంగా గుర్తించబడింది. కెపిహెచ్‌బి (237), జూ పార్క్ (213), న్యూ మలక్‌పేట్ (197), సోమాజిగూడ (177), సైదాబాద్ (170), కోటి (160), బంజారాహిల్స్ (107) ‘తక్కువ’ గాలి నాణ్యతతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆశ్చర్యకరంగా గాలి నాణ్యత సరిగా ఉండని కోకాపేట్ ప్రాంతంతో మితమైన (30) AQIతో అత్యల్ప సంఖ్యను నమోదు అయ్యింది. మరోవైపు మణికొండ, మాదాపూర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వాయు నాణ్యత నమోదైంది.
అనారోగ్యకరమైన గాలి నాణ్యత కారణంగా, జనాలు బయటికి వెళ్లినప్పుడల్లా మాస్కులు ధరించడం బెటర్. దీని వల్ల వాయు కాలుష్య కారకాల నుండి వారి ఊపిరితిత్తులను రక్షించుకోవచ్చు. దీపావళి వేడుకలు ముగిసే వరకు కిటికీలు మూసి ఉంచడం వల్ల కాలుష్య బారి నుంచి తప్పించుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..