Hyderavad: ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ.. అక్రమాస్తుల చిట్టా చూస్తే బిత్తరపోవాల్సిందే
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్, లాకర్స్‌లో బంగారం చూసి.. అధికారులే నివ్వెరపోయారు. శివబాలకృష్ణ పెట్టుబడులతో పాటు.. అక్రమాస్తుల కేసులో అధికారుల పాత్రపై కూపీ లాగుతున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బినామీల పేరుతో 214 ఎకరాల భూములు, 29 ఓపెన్ ప్లాట్స్, 7ఫ్లాట్స్, ఒక విల్లాను గుర్తించామన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. జనగామ జిల్లాలో 102ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూముల గుర్తించామన్నారు. ఆస్తులన్నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించారన్నారు ఏసీబీ జేడీ.
మొదటిరోజు కస్టడీలో శివబాలకృష్ణ సహకరించకున్నా.. తమ దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టి ప్రశ్నించడంతో.. నోరు విప్పారు. 48 భూముల డాక్యుమెంట్స్‌లో 21 డాక్యుమెంట్స్ సోదరుడు నవీన్, నవీన్ భార్య అరుణ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. నార్సింగి, పుప్పాలగూడలో భారీ అపార్ట్‌మెంట్స్ కు అక్రమంగా పర్మీషన్ ఇచ్చారని శివబాలకృష్ణ నుంచి వివరాలు రాబట్టారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న 2 రియల్ ఎస్టేట్ సంస్థల ఫైల్స్ క్లియర్ కూడా క్లియర్ చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. తమకు మేలు చేసినందుకు కొందరు బిల్డర్లు భారీగా డబ్బులు ఇవ్వగా.. మరికొందరు బినామీలకు ఫ్లాట్స్ ఇచ్చారని తేల్చారు. ఇలా హైదరాబాద్ పరిసరాల్లో వివిధ లే ఔట్స్‌లో 29 ఓపెన్ ప్లాట్స్, ఏడు ఫ్లాట్స్ గుర్తించామన్నారు ఏసీబీ జేడీ. విజయనగరం, విశాఖలోనూ 4 ప్లాట్స్ ఉన్నాయన్నారు. మొత్తం శివ బాలకృష్ణ ఆస్తులు 250 కోట్లకు పైగానే ఉంటాయన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర.
శివబాలకృష్ణ కస్టడీ సమయంలోనే హెచ్ఎండిఏ, రెరా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.. పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకుంది. HMDA ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి జాయింట్ డైరెక్టర్ వరకు అందరినీ ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. కొంతమంది మంత్రుల పేర్లు చెప్పి బాలకృష్ణ సంతకాలు పెట్టమనడంతో.. తాము సైన్ చేశామని ఏసీబీ విచారణలో ఒప్పుకున్నారు కిందిస్థాయి అధికారులు. ఇక లాకర్స్ లోనూ భారీగా బంగారం, విలువైన పత్రాలు గుర్తించామన్నారు ఏసీబీ జేడీ. రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు, అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. 2021 నుంచి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణ.. శంషాబాద్, శంకర్ పల్లి, ఘట్‌కేసర్ జోన్లకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఇదే సమయంలో 100కు పైగా బిల్డింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చారు శివబాలకృష్ణ. దీంతో.. ఆ బిల్డింగ్స్‌కు సంబంధించిన బిల్డర్లకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు అధికారులు.
పోలీస్ కస్టడీ ముగియడంతో.. ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నుంచి రిమాండ్‌పై జైలుకు తరలించారు. శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో సోదరుడు శివ నవీన్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపామన్నారు ఏసీబీ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..