Hyderabad: నుమాయిస్‌లో కొవ్వెక్కి ప్రవర్తించిన మగవాళ్ల బెండుతీసిన షీ టీమ్స్
ప్రస్తుత సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది షీ టీమ్. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారింది. ఆడవాళ్ల జోలికొస్తే తాట వొలుస్తామంటోంది తెలంగాణ షీ టీమ్స్. మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు షీ టీమ్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది.

కొంతమంది పోకిరీలు ఎవరూ చూడటం లేదనుకుని రెచ్చిపోతున్నారు. అమ్మాయిలను అదేపనిగా వేధిస్తున్నారు. యువతులను వేధిస్తున్న వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నా పోకిరీలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ వైపు సోషల్ మీడియా మరోవైపు కాలేజీలు, బస్ స్టాండ్స్, కార్పొరేట్ ఆఫీసులు, లేడీస్ హాస్టల్స్ వద్ద మహిళలు, యువతులను వేధిస్తున్న ఘటనలు 3 కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్నాయి. పెట్రోలింగ్ పోలీసులను లెక్కచేయకుండా ఈవ్ టీజింగ్‌కి పాల్పడుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో షీ టీమ్స్ గస్తీ కాస్తున్నాయి. షీ టీమ్స్ బృందాలు హాట్‌స్పాట్‌లలో దశల వారీగా అపరేషన్లు నిర్వహిస్తూ కొవ్వెక్కి ప్రవర్తించేవారి భరతం పడుతున్నారు. ఇక ప్రత్యేక ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో మహిళలను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారికి మఫ్టీల్లో తిరుగుతూ చెక్ పెడుతున్నాయి షీ టీమ్స్. వీడియో సాక్ష్యాధారాలతో వారిని పట్టేసి… జైల్లో వేస్తున్నారు.
తాజాగా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరిగిన రోజుల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరిగిన నుమాయిష్‌లో మొత్తంగా 37 కేసుల్లో న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు నిందితులకు 2 రోజుల జైలు శిక్ష, 33 మందికి రూ.1,050 చొప్పున ఫైన్ వేసినట్లు తెలిపారు. నిందితుల్లో 190 మందిని బుద్ది మార్చుకోవాలని హెచ్చరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మరో 20 కేసుల్లో విచారణ జరుగుతుందని విమెన్ సేఫ్టీ డీసీపీ తెలిపారు. పట్టుబడ్డ 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




