గుప్త నిధుల కోసం వెళ్లగా 11 అడుగుల నాగు పాము ప్రత్యక్షం.. 300 ఏళ్ల పురాతన భవనంలో ఊహించని దృశ్యం. హైదరాబాద్‌లోనే..
ఎన్నో వందల ఏళ్ల చరిత్రకు హైదరాబాద్ నగరం సజీవ సాక్ష్యం. నగరంలో ఎన్నో పురాతన నిర్మాణాలు, సొరంగాలు ఉన్నాయి. నిర్మాణాలు జరిగే సమయంలోనో, గుప్త నిధుల కోసం జరిగే తవ్వకాల సందర్భాల్లోనో ఇలాంటి సొరంగాలు అడపాదడపా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఓ సొరంగమే..
ఎన్నో వందల ఏళ్ల చరిత్రకు హైదరాబాద్ నగరం సజీవ సాక్ష్యం. నగరంలో ఎన్నో పురాతన నిర్మాణాలు, సొరంగాలు ఉన్నాయి. నిర్మాణాలు జరిగే సమయంలోనో, గుప్త నిధుల కోసం జరిగే తవ్వకాల సందర్భాల్లోనో ఇలాంటి సొరంగాలు అడపాదడపా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఓ సొరంగమే హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని రాజేంద్రనంగర్‌లో ఉన్న ముషక్ మహల్‌లోకి కొందరు యువకులు వెళ్లారు. కులీకుతుబ్ షాహీ కాలానికి చెందిన ఈ భవనానికి సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉంది.
ఈ క్రమంలోనే భవనంలోకి వెళ్లిన యువకులకు ఒక చిన్న సొరంగంలాంటిది కనిపించింది. అందులో కచ్చితంగా గుప్త నిధులు ఉంటాయన్న నమ్మకంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమేర దూరం వెళ్లగానే వారికి 11 అడుగుల ఓ భారీ పాము కనిపించింది. యువకుల అలికిడి వినిపించగానే ఆ పాము బుసలు కొడుతూ వారిని వెంబడించింది. దీంతో యువకులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వారితో పాటు బయటకు వచ్చిన ఆ పాము దగ్గర్లోని పొదల్లోకి వెళ్లిపోయింది. పాము వెళుతున్న సమయంలో స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక అనంతరం ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. అసలు ఆ భవనంలోని సొరంగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. అందులో ఏమున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ భారీగా నిధులు ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే చార్మినర్ నుంచి గోల్కోండకు ఒక సొరంగ మార్గం ఉందన్న వాదనాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బయటపడ్డ సొరంగం దానికి సంబంధించిందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారులు రంగంలోకి దిగకతప్పదు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..