Telangana: అనారోగ్య కారణాలతో బాబా దగ్గరకు వెళ్లారు.. కట్ చేస్తే, క్షుద్రపూజలు, రూ.100 కోట్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఏంట్రా ఇది!
అనారోగ్య సమస్యలతో వెళితే క్షుద్రపూజల పేరుతో భయపెట్టి లక్షలు స్వాహా చేశాడు ఓ నకిలి స్వామిజీ.. గుప్త నిధులున్నాయని వెలికి తీయాలంటూ నమ్మించాడు. తీరా ఓ కంచు విగ్రహం వెలికితీసి దంపతుల కష్టార్జీతాన్ని కాజేశాడు. ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగి.. చివరికి కటకటల పాలయ్యారు ఓ దొంగ బాబా..

అనారోగ్య సమస్యలతో వెళితే క్షుద్రపూజల పేరుతో భయపెట్టి లక్షలు స్వాహా చేశాడు ఓ నకిలి స్వామిజీ.. గుప్త నిధులున్నాయని వెలికి తీయాలంటూ నమ్మించాడు. తీరా ఓ కంచు విగ్రహం వెలికితీసి దంపతుల కష్టార్జీతాన్ని కాజేశాడు. ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగి.. చివరికి కటకటల పాలయ్యారు ఓ దొంగ బాబా.. వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లికి చెందిన పద్మ, వెంకటేశ్ దంపతులు పెబ్బేరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే దంపతులు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సమస్యను వెంకటేశ్ బావమరిది నగేశ్ కు చెప్పారు. కర్నూల్ జిల్లా ఆదోని మండలం బైచిగేరికి చెందిన కొందరు స్వాములు పూజలు చేసి అనారోగ్య సమస్యలు తీరుస్తారని చెప్పాడు. దీంతో 2021లో దంపతులు ఇద్దరు నకిలీ స్వామిజీ జవాలగిరి దుర్గాసింగ్ వద్దకు వెళ్లారు. ఇక తన వద్దకు వచ్చిన పద్మ, వెంకటేశ్ నుంచి వివరాలు తీసుకున్న నకిలీ స్వామిజీ గుప్త నిధుల పేరుతో వంచించాడు. పెబ్బేరులోని అద్దె నివాసంతో పాటు స్వగ్రామంలోని వ్యవసాయ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని వాటివల్లే ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పాడు. వాటిని వెంటనే బయటకు తీయాలని లేకుంటే ఇంట్లో వాళ్లు చనిపోతారని భయాందోళనకు గురిచేశాడు. దీంతో ఉండవెల్లికి అక్కడ వ్యవసాయ పొలంలో గుంతలు తీసి పూజలు చేశాడు. అక్కడ ఏమి లభించలేదని.. మీరు నివాసం ఉండే ఇంట్లో పూజలు చేయాలని నమ్మించాడు. ఇక పూజల కోసం రూ.10లక్షలు ఖర్చవుతుందని నమ్మించి ఆ డబ్బును కాజేశాడు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం ఓ రోజు రాత్రి లక్ష్మీదేవి కంచు విగ్రహాన్ని తీసుకొని పెబ్బేరులో ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించి గుంతలు తీసి పూజలు చేసి లక్ష్మీదేవి విగ్రహం లభ్యమైనట్లు నమ్మించాడు. ఇక లభించిన లక్ష్మీదేవి విగ్రహాన్ని మీ దగ్గర ఉంటే ఇంట్లో ఉండే పిల్లలకు మంచిది కాదని బెదిరించారు. ఢిల్లీలో ఉండే డీలర్లతో మాట్లాడి విదేశాలకు అమ్మాలని నమ్మించారు.
విగ్రహం అమ్మితే 100 కోట్లు..
లక్ష్మీదేవి విగ్రహం అమ్మితే సుమారు రూ.100కోట్లకు పైగా ధర వస్తుందని చెప్పి వారి వద్ద విడతల వారీగా రూ.40లక్షల వరకు వసూలు చేశారు. పలుమార్లు ఢిల్లీకి తీసుకువెళ్లి ఏదో చర్చలు చేసినట్లుగా నటించారు. అయితే ఏళ్లు గడిచిన ఎన్నిసార్లు వెళ్లిన పనికాకపోవడంతో అనుమానంతో దుర్గాసింగ్ ను నిలదీశారు. తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఇక మోసాన్ని బాధితులు గ్రహించడంతో నకిలీ స్వామిజీ దుర్గాసింగ్ ప్లేట్ ఫిరాయించాడు. తన దగ్గరికి రావద్దని.. వస్తే చంపేస్తానని బాధితులను బెదిరించాడు. ఇక ఈ నెల 5న పెబ్బేరు పీఎస్ లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాలతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ స్వామిజీ దుర్గాసింగ్, బగలి ముకుంద కుమార్ ను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలోనే వారిని సైతం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
అయితే.. గుప్త నిధుల పేరిట డబ్బులు దండుకుంటున్నారని.. ఇవన్నీ భూటకమని.. నకిలీ స్వామిజీలను ప్రజలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా మభ్యపెడితే తమకు సమాచారం అందించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
