AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ చుట్టూ మరో భారీ రహదారి.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టూ మరో రహదారి నిర్మాణానికి సిద్దమవుతోంది. సిటీలోకి రాకుండానే శివారు ప్రాంతాల గుండా వెళ్లేలా రోడ్డు నిర్మించనుంది. దీని వల్ల నగరం లోపల రవాణా భారం తగ్గుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు.

Hyderabad: హైదరాబాద్ చుట్టూ మరో భారీ రహదారి.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లోనే..
Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 12:47 PM

Share

హైదరాబాద్‌ విస్తరణకు అనుగుణంగా నగరం చుట్టూ రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నగరంలోకి రాకుండానే శివారు ప్రాంతాల మధ్య నేరుగా ప్రయాణించేలా కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఓఆర్‌ఆర్‌లోని బుద్వేల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నాచారం వద్ద జాతీయ రహదారి-167కు చేరనుంది. మొత్తం సుమారు 81 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు. ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రాథమికంగా ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. టెండర్లకు ఈ నెల 30 వరకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రేడియల్‌ రోడ్డు-2 అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. సరుకు రవాణా వాహనాలు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, పరిశ్రమలకు కూడా ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌, జాతీయ రహదారులకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. దీంతో హైదరాబాద్‌ ప్రధాన నగరంపై రవాణా భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

రేడియల్‌ రోడ్డు-2ను తొలుత కొత్వాల్‌గూడ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల మేర నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్‌ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మార్గాన్ని మరింత విస్తరించారు. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఎక్కువ మండలాలు, గ్రామాలకు కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలో మార్పులు చేశారు. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఈ రహదారి శంషాబాద్‌, షాబాద్‌, పూడూరు, పరిగి, కోస్గి ప్రాంతాల మీదుగా సాగి నాచారం వద్ద జాతీయ రహదారి-167ను కలుస్తుంది.

మూడు ప్యాకేజీలుగా పనులు

రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణాన్ని మూడు భాగాలుగా విభజించారు.

ప్యాకేజీ-1: ఓఆర్‌ఆర్‌ బుద్వేల్‌ నుంచి షాబాద్‌ వరకు

ప్యాకేజీ-2: షాబాద్‌ నుంచి గూడూరు వరకు

ప్యాకేజీ-3: గూడూరు నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి-167 వరకు

ఇలా దశలవారీగా పనులు చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారి కోసం అవసరమైన భూములను గుర్తించి మార్కింగ్‌ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌లోని రావిర్యాల జంక్షన్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట్‌, అక్కడి నుంచి ఆమన్‌గల్లు వరకు 41.50 కిలోమీటర్ల రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టును సుమారు రూ.4,621 కోట్లతో చేపడుతున్నారు. ఈ రహదారితో పాటు రేడియల్‌ రోడ్డు-2 కూడా పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ ఉన్న బాహ్య రహదారుల నెట్‌వర్క్‌ మరింత విస్తరించనుంది.

కొత్త రహదారులు కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధిని కూడా వేగవంతం చేసే అవకాశం ఉంది. మెరుగైన కనెక్టివిటీతో పారిశ్రామిక యూనిట్లు, వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు పెరిగే అవకాశం ఉంది. రోడ్డు వెంట ఉన్న ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది. మొత్తంగా రేడియల్‌ రోడ్డు-2 పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, జాతీయ రహదారులను కలిపే మరో కీలక రవాణా కారిడార్‌ అందుబాటులోకి రానుంది.

Follow Us