ఇంటర్ విద్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. 11వ తరగతికి బోర్డు పరీక్ష రద్దు!
తెలంగాణలో విద్యారంగంలో భారీ మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పదో తరగతి తర్వాత ఏటా 40 నుంచి 45 వేల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027-28 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట బోధన అందించే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 411 ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఉపయోగించుకోనున్నారు. మరోవైపు 11వ తరగతికి బోర్డు పరీక్షను రద్దు చేసి, 12వ తరగతిలో మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది. ఈ మార్పులతో విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించి, ముఖ్యంగా బాలికల చదువును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది..

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ విద్యారంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు చదువుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం 2027-28 నుంచి సీనియర్ సెకండరీ విద్యా విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం అమల్లోకి వస్తే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కల్పించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తయిన తర్వాత సుమారు 12 శాతం మంది విద్యార్థులు తదుపరి చదువులకు దూరమవుతున్నారు. ఏటా దాదాపు 40 నుంచి 45 వేల మంది విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో చేరడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐదో తరగతి పూర్తయిన విద్యార్థుల్లో 99.1 శాతం మంది ఆరో తరగతిలో చేరుతుండగా, ఎనిమిదో తరగతి తర్వాత 98.8 శాతం మంది తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు. అయితే పదో తరగతి తర్వాత ఇంటర్ ఫస్టియర్లో చేరుతున్న వారి శాతం 88 శాతానికి పడిపోతోంది. డ్రాపౌట్లలో 96 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారు కాగా, 70 శాతం మంది బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పదో తరగతి తర్వాత మరో విద్యాసంస్థలో చేరాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు అందుబాటులో లేకపోవడం డ్రాపౌట్లకు ప్రధాన కారణాలుగా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు విద్యాశాఖ అధ్యయనంలో తేలింది.
అయితే మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో 10వ తరగతి తర్వాత కూడా విద్యార్థులు చదువు కొనసాగించే అవకాశాలు ఉండటంతో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పాఠశాలల్లో 10వ తరగతి తర్వాత దాదాపు 99 శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కొత్త విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 96 కాలేజీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లోనే ఉన్నాయి. మరో 260 జూనియర్ కాలేజీలు ఉన్నత పాఠశాలలకు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉండగా, 55 కాలేజీలు ఒకటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరో 19 కాలేజీలు మాత్రమే ఐదు కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. దీంతో 19 కాలేజీలను మినహాయించి మిగిలిన 411 జూనియర్ కాలేజీల్లో 9 నుంచి 12వ తరగతి వరకు బోధన అందించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు.
ప్రైవేటు కాలేజీలకు కూడా కొత్త నిబంధనలు
ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల విషయంలోనూ మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి వరకు బోధన అందిస్తున్న ప్రైవేటు పాఠశాలలు 11, 12వ తరగతుల బోధనకు అనుమతి పొందవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ బోధన అందిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలు 9, 10వ తరగతులకు కూడా అనుమతులు తీసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు 9 నుంచి 12వ తరగతి వరకు బోధన అందించే అవకాశం కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకేసారి 9, 10 తరగతులు ప్రారంభించవచ్చు లేదా మొదటి ఏడాది 9వ తరగతి, ఆ తర్వాతి ఏడాది 10వ తరగతి ప్రారంభించే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
11వ తరగతికి బోర్డు పరీక్ష ఉండదా?
కొత్త సీనియర్ సెకండరీ విద్యా విధానంలో మరో కీలక మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం వరుసగా మూడు సంవత్సరాలు బోర్డు పరీక్షలు రాయాల్సి వస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు 11వ తరగతి బోర్డు పరీక్షను తొలగించాలని భావిస్తోంది. కొత్త విధానంలో 11వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించినప్పటికీ వాటిని బోర్డు పరీక్షలుగా పరిగణించరు. కేవలం 12వ తరగతిలోనే బోర్డు పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న బాలికల్లో కొందరికి తల్లిదండ్రులు చిన్న వయసులోనే వివాహాలు జరిపిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పాఠశాల విద్యను 12వ తరగతి వరకు కొనసాగించడం ద్వారా బాలికల విద్యకు ప్రోత్సాహం లభించడంతో పాటు బాల్య వివాహాలను కూడా తగ్గించవచ్చని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కొత్త విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 9 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట చదువుకునే అవకాశం ఏర్పడనుంది. ముఖ్యంగా పదో తరగతి తర్వాత చదువులకు దూరమవుతున్న వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.




