AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: హైదరాబాద్ వాసులకు గుడ్‌ న్యూస్.. ఇక అక్కడి వరకు మెట్రో..

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్‌కు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం ఆదేశించింది.

Telangana News: హైదరాబాద్ వాసులకు గుడ్‌ న్యూస్.. ఇక అక్కడి వరకు మెట్రో..
Hyderabad Metro
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 01, 2025 | 7:33 PM

Share

హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్‌ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి  దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్ బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అదే విధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్‌కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. గత మల్కాజ్‌గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్‌ల రూట్ మ్యాప్‌లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు.

డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు ఇతర అనుబంధ డాక్యుమెంట్‌ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి