Viral Video: హైదరాబాదీలకు కొత్త సమస్య.. ఈ ప్రాంతాల్లో రాత్రి అయితే నరకమే..
హైదరాబాద్‌లో దోమల బెడద కొత్త రూపంలో కనిపిస్తోంది. సాధారణంగా ఒక్కో దోమను చూడటం సహజమే. కానీ లంగర్‌హౌస్‌లో మాత్రం దోమలు గుంపులుగా చేరి.. సుడిగాలిలా పైకి దూసుకెళ్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్ వాసులకు కొత్త సమస్య మొదలైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దోమల గుంపులు ప్రజలను తెగ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇందుకు సబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతన్నాయి. వైరల్ వీడియోలో భారీ సంఖ్యలో దోమలు ఒకచోట గుంపుగా చేరి.. భూమి నుంచి పైకి ఎగురుతూ, వలయాకారంలో తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. చూస్తే దోమలు సుడిగాలిలా తిరుగుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.అయితే అసలు దోమలు ఇలా గుంపులుగా ఎందుకు తిరుగుతున్నాయి? ఇది దోమల సహజ ప్రవర్తనా? లేక ఆ ప్రాంతంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా ఇలా గుంపుగా చేరుతున్నాయా? అనే ప్రశ్నలు స్థానికుల్లో మొదలయ్యాయి.
అంతేకాదు లంగర్‌హౌస్ నుంచి టోలిచౌకి వరకు ఇదే పరిస్థితి? నెలకొంది. లంగర్‌హౌస్, టోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, జూబ్లీహిల్స్, షేక్‌పేట్ వరకు రోడ్డుపై తీవ్రంగా సంచరిస్తున్న దోమల గుంపు స్థానికులు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మురుగు కాలువలు, నిలిచిపోయిన నీరు, చెత్త పేరుకుపోవడం వంటి కారణాలతో దోమలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. సాధారణంగా వర్షాకాలంలో దోమలు ఉండేవని.. కానీ మరీ ఇంత భారీ సంఖ్యలో గుంపుగా దోమలు ఇలా సుడిగాలిలా కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి అంటున్నారు స్థానికులు. కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జీహెచ్‌ఎమ్ అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు.
దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అధికారులను కోరుతున్నారు. ఇక వైరల్ అవుతున్న ఈ దృశ్యాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోమలు నిజంగానే సుడిగాలి ఆకారంలో తిరుగుతున్నాయా? లేక పెద్ద సంఖ్యలో ఒకేచోట గుంపుగా ఎగరడం వల్ల కెమెరాలో అలా కనిపిస్తుందా? అనేది తెలుసుకోవాల్సి ఉంది.
ఏదేమైనా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న దోమల సమస్యపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దోమల ఉత్పత్తికి కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ఈ బెడద నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
