Hyderabad: గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల మ్యాప్‌లో భాగ్యనగరం.. ఇక ఉద్యోగాల జాతరే!
గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల లీజింగ్ రేసులో హైదరాబాద్ మహానగరం దూకుడు పెంచుతోంది. దేశవ్యాప్తంగా గ్లోబల్ సెంటర్ల ఆకర్షణలో భాగ్యనగరం కీలక స్థానాన్ని దక్కించుకుంది. తాజా సర్వేల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సావిల్స్ ఇండియా విడుదల చేసిన తాజా అధ్యయనంలో ఈ స్థానం దక్కింది.

గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల లీజింగ్ రేసులో హైదరాబాద్ మహానగరం దూకుడు పెంచుతోంది. దేశవ్యాప్తంగా గ్లోబల్ సెంటర్ల ఆకర్షణలో భాగ్యనగరం కీలక స్థానాన్ని దక్కించుకుంది. తాజా సర్వేల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సావిల్స్ ఇండియా విడుదల చేసిన తాజా అధ్యయనంలో ఈ గౌరవం దక్కింది. 2020 నుంచి 2024 మధ్యకాలంలో హైదరాబాద్‌లో జీసీసీలు తమ కార్యకలాపాల కోసం మొత్తం 1.86 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్లు (GCCs) ఏర్పాటు చేసే నగరాల్లో హైదరాబాద్ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా జీసీసీల లీజింగ్‌లో హైదరాబాద్ 17 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరు 38 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, పుణె 14 శాతం, చెన్నై 11 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్ 11 శాతం, ముంబై 8 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో తొలి మూడు నగరాలే 86 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం..!
సావిల్స్ నివేదిక ప్రకారం, 2020–24 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు 262 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకోగా, అందులో జీసీసీల వాటా 112 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. అంటే మొత్తం లీజింగ్‌లో జీసీసీల వాటా 43 శాతంగా ఉంది. భవిష్యత్తులో కూడా జీసీసీల విస్తరణ కొనసాగుతుందని నివేదిక అంచనా వేస్తోంది. 2025 నుంచి 2030 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జీసీసీలు సుమారు 3 కోట్ల చదరపు అడుగుల కొత్త కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశం ఉందని సావిల్స్ ఇండియా విశ్లేషించింది.
హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ జీసీసీలకు ముఖ్య కేంద్రంగా మారిందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాలకు చెందిన సంస్థలు తమ గ్లోబల్ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.
నైపుణ్యం కలిగిన యువత లభ్యత, అంతర్జాతీయ నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, సరసమైన కార్యాలయ అద్దెలు, హైబ్రిడ్ వర్క్ మోడళ్లకు అనుకూల వాతావరణం వంటి అంశాలు జీసీసీలను ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలుగా సావిల్స్ నివేదిక పేర్కొంది. అలాగే పర్యావరణ అనుకూల కార్యాలయాలపై పెరుగుతున్న దృష్టి కూడా నగరానికి అదనపు ఆకర్షణగా మారింది.
ప్రస్తుతం దేశంలో సుమారు 1,800 జీసీసీలు పనిచేస్తుండగా, వీటిలో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా జీసీసీల సంఖ్య 2,200కు చేరి, ఉపాధి అవకాశాలు 28 లక్షలకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధిలో హైదరాబాద్ కీలక నగరంగా కొనసాగనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
