కుళ్లిపోయిన చికెన్‌తో బిర్యాని..! తార్నాక చౌరస్తాలో GHMC డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, తార్నాకలోని డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ అమ్ముతున్నట్లు తెలుసుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాత, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను గుర్తించారు. నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరంలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్లు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్ లపై ఆకస్మిక తనిఖీలు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆదేశించారు. తార్నాక చౌరస్తా వద్ద ఉన్న డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన చికెన్ ఉపయోగించి బిర్యానీ ప్రజలకు అందిస్తుండడంతో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి స్పందించి, రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా పాత, అన్ హైజినిక్ ఆహార పదార్థాలు గుర్తించి, రెస్టారెంట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడిన డిప్యూటీ మేయర్ గారు, డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో ఉన్న అన్ని నాన్-హైజినిక్ పదార్థాలపై వెంటనే ఇన్స్పెక్షన్ చేయించి, కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. “ఆహార నాణ్యతకు దూరమైన అన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా నగర ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాము. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తగిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు. అలాగే నగరంలోని అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో కీలకమని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి