Huzurabad bypoll: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌.. ఫలితంపైనే అందరి దృష్టి.. సర్వేలు ఏం చెబుతున్నాయి!

Huzurabad by election: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఐదారు నెలల ఉత్కంఠకు రేపు తెరపడనుంది.

Huzurabad bypoll: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌..  ఫలితంపైనే అందరి దృష్టి.. సర్వేలు ఏం చెబుతున్నాయి!
Huzurabad By Poll
Balaraju Goud

|

Nov 01, 2021 | 11:53 AM

Huzurabad by Election: నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక‌ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఐదారు నెలల ఉత్కంఠకు రేపు తెరపడనుంది. హుజురాబాద్‌ బాద్‌షా ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది జిల్లా యంత్రాంగం. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటి అరగంటలో పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్‌ కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశముంది.

తెలంగాణలోనే కాదు , పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక కూడా చర్చనీయాంశంగా మారింది . శనివారం పోలింగ్ అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేరాక నేతలు విజయావకాశాలపై ఎవరి లెక్కలు వారు ప్రారంభించారు . కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలింగ్ సమయం గతంతో పోలిస్తే ఈసారి రెండు గంటలు అదనంగా పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, దాన్ని రాత్రి 7 గంటలకు పెంచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని ఆదివారం హుజురాబాద్ ఆర్డీవో, ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్రెడ్డి ప్రకటించారు.

ఇదిలావుంటే, రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ ఉపఎన్నిక ఫలితాలను ముడి పెట్టడంతో అంతా ఒక్కసారిగా హుజురాబాద్ వైపు చూడటం ప్రారంభించారు. అక్కడ ఏం జరిగినా , మీడియాలో పతాకశీర్షికన రావడంతో స్థానిక ఓటర్లతోపాటు తెలుగురాష్ట్రాల ప్రజల్లో రోజురోజుకు ఆసక్తి పెంచింది. ఈసారి అనుహ్యంగా పోలింగ్ శాతం పెరగడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉప ఎన్నికలో ఎన్నడూ ఇంతటి భారీ పోలింగ్ నమోదవలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం పైగా పోలింగ్ నమోవడం గమనార్హం. మరోవైపు నవంబరు 2 న ఫలితాలు వెల్లడవనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీల ఇన్ ఛార్జ్ లు ఎన్నిక జరిగిన తీరుపై విశ్లేషణలు మొదలుపెట్టారు. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.

శనివారం అంతా అనుకున్నట్లుగానే భారీగా పోలింగ్ శాతం నమో దైంది . హుజూరాబాద్ ( 85.66 % ) , వీణవంక ( 88.66 % ) , జమ్మికుంట ( 83.66 % ) , ఇల్లందకుం ( 90.73 % ) , కమలాపూర్ ( 87.57 % ) భారీగా పోలింగ్ శాతం నమోదైంది . నియోజకవర్గంలో పు రుషులు 87.05 శాతం ఓటు వేయగా .. మహిళలు 86.25 శాతం ఓటేశారు . వాస్తవానికి నియోజకవర్గం లో మహిళల సంఖ్య అధికంగా ఉన్నా .. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిల వడం గమనార్హం . మొత్తం మీద 86.64 % పోలిం గ్ నమోదవడం అటుఅధికారుల్ని , ఇటు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరిచింది . నియోజకవర్గంలో 2,36,873 మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.

ఇదిలావుంటే, 2018లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 1,76,723- (84.42%) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 59.34 శాతం ఓట్లు పోలయ్యాయి. సమీప అభ్యర్థిపై 43,719 ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపొందారు. సెకండ్‌ ప్లేస్‌తో డిఫరెన్స్‌ – 24.74శాతానికే పరిమితమైంది. ఇక, 2014 విషయానికి వస్తే మొత్తం పోలైన ఓట్లు – 1,62,675 (77.54%) కాగా, TRS అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 61.44 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన తన సమీప అభ్యర్థిపై 57,037 మెజార్టీతో గెలుపొందారు. సెకండ్‌ ప్లేస్‌తో డిఫరెన్స్‌ – 36.76% శాతం మాత్రమే.

మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం 30. మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ తరుఫున బల్మూరి వెంకట్‌ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా టీఆర్ఎస్- బీజేపీల మధ్య ‘ నువ్వా – నేనా ‘ అన్న స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి . దీంతో సైలెంట్ ఓట్లపై ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది.

అయితే, ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు దాన, ధర్మ, దండోపయాలను ప్రయోగించాయి. గత 30న జ‌ర‌గిన ఉప ఎన్నిక‌పై అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు బీజేపీ అభ్యర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో దిగారు. ఈట‌ల‌తో పాటు క‌మ‌లనాధులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈట‌ల గెలిస్తే తెలంగాణ‌లో BJP బ‌లం మ‌రింత పెరుగుతుంది. దీని వ‌ల్ల రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేన‌ని చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. ఈ పరిణామాలతో బీజేపీ ఈట‌ల గెలుపు కోసం అహ‌ర్నిశ‌లు శ్రమించింది. ఈట‌ల‌కు జ‌రిగిన అన్యాయం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేప‌డుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈటల గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు ఇక్కడే మకాం వేశారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జోరు ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల నేత‌లు ఇంటింటికీ వెళ్తు ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ త‌ర‌ఫున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ప్రజల దగ్గరికి వెళ్లారు. అటు వలసలతో ఇతర పార్టీ నేతలకు గాలం వేసిన అధికార పార్టీ మంత్రులను రంగంలోకి దింపింది. MLAలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్న పథకాలను వివరించారు అధికార పార్టీ నేతలు. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించే బాధ్యత మంత్రి హరీష్‌రావు పైన పెట్టింది టీఆర్‌ఎస్ అధిష్టానం. ఆయన అక్కడే ఉండి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇక, హుజూరాబాద్ జనం ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు , అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసకుంటున్నారు. కొన్ని సర్వేల్లో ఈటల గెలుపు తథ్యం అన్నట్లు చూపుతున్నా.. మరికొన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అన్నట్లు తెలుపుతున్నాయి. రేపు జరగున్న కౌంటింగ్ లో ఎవరు చివరగా బాద్ షాగా నిలుస్తారో చూద్దాం.

Read Also… 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu