కత్తి మూసిలో.. మొబైల్ దుర్గం చెరువులో.. మృతదేహం నల్లమల్ల అడవుల్లో.. భార్యను ఎలా చంపాడంటే?
ప్రేమించి పెళ్లాడిన భార్య వివాహేతర సంబంధాలు తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టాడు భర్త. సోమశిల చూసోద్దాం అని చెప్పి నల్లమల అడవిలోకి తీసుకెళ్లి పైలోకానికి పంపాడు. చున్నితో గొంతు నులిమి... కత్తితో పొడిచి, గొంతుకోసి... చివరికి దహనం చేశాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలోనే తీవ్ర కలకలం రేపుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలంకు రాంగ్ డయల్ లో దేవరకద్ర మండలం గోటూర్ కు చెందిన యువతి శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి చివరకు పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలను ఒప్పించి 2014లో వివాహం సైతం చేసుకున్నారు. దాంపత్య జీవితంలో వీరికి ఒక పాప, బాబు జన్మించారు. శ్రీశైలం వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అన్యోంన్యంగా సాగుతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం పెను చిచ్చు రాజేసింది. శ్రావణి అక్క భర్తతో వివాహేతర సంబంధం నెరిపింది. అంతేకాకుండా అక్క భర్తతో కొన్నేళ్లు సహజీవనం సాగించింది. ఈ క్రమంలో భార్య, పిల్లలను వదిలి శ్రీశైలం హైదరాబాద్ వచ్చి వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
కొన్నాళ్ల క్రితం బావ దగ్గరి నుంచి తిరిగొచ్చిన శ్రావణి పిల్లలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉంటోంది. ఓ షాపింగ్ మాల్ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది. అయితే ఈ క్రమంలో ఏడాదిన్న క్రితం భర్త శ్రీశైలం, భార్య శ్రావణిలు దాంపత్య జీవితాన్ని పున:ప్రారంభించారు. హైదరాబాద్ లోనే వెల్డింగ్ పనులు చేస్తూ భార్య, పిల్లల వద్దకు వారానికి ఒకసారి వచ్చి వెళ్తున్నాడు శ్రీశైలం. ఈ క్రమంలో భర్య వేరే వ్యక్తులతో ఛాటింగ్ చేస్తోందని గ్రహించిన భర్త శ్రీశైలం శ్రావణీని కొట్టాడు. దీంతో శ్రావణీ మహిళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసింది. ఈ ఘటన అనంతరం కొద్ది రోజుల క్రితం ఇంట్లో వేరొకరితో శ్రావణి చనువుగా ఉండడాన్ని గమనించిన శ్రీశైలం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైన సరే తన జీవితాన్ని నాశనం చేసిన శ్రావణీని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అందుకోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఎర్రగడ్డ సండే మార్కెట్ లో కత్తి కొని దాచుపెట్టుకున్నాడు.
సోమశిల చూద్దామని చెప్పి.. దారుణానికి ఒడిగట్టి
ఇక భార్య శ్రావణికి ఈ నెల 20వ తేదిన ఫోన్ చేసి 21న సోమశిల చూడడానికి వెళ్దాం… మళ్లీ సాయంత్రానికి తిరిగి వచ్చేద్దామని చెప్పాడు. భర్త మాటలను నమ్మిన శ్రావణి సరే అని చెప్పింది. పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి షాద్ నగర్ కు వచ్చి అక్కడ మిత్రుడి బైక్ తీసుకొని మహబూబ్ నగర్ కు వచ్చాడు శ్రీశైలం. తన వెంట ఎర్రగడ్డ మార్కెట్ లో కొన్న కత్తిని తెచ్చుకున్నాడు. అలాగే ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్ ను సైతం క్యారీ చేశాడు. భార్య శ్రావణికి కాల్ చేసి మేయిన్ రోడ్డు మీదకు రమ్మని చెప్పాడు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి సోమశిలకు ప్రయాణం అయ్యారు. ఇక పెద్దకొత్తపల్లి సమీపంలోకి చేరుకోగానే శ్రీశైలం తన ప్లాన్ ను అమలు చేశాడు.
ఈ పక్కనే అడవి ఉంది… చాలా సీతాఫలాలు ఉంటాయని నమ్మించి సాతాపూర్ , మారేడుమానుదిన్నె రహదారి ప్రక్కన ఉన్న నల్లమల అడవిలోకి తీసుకెళ్లాడు. ఇక శ్రావణి చున్నీని ఆమె మెడకు చుట్టి గట్టిగా నులిమి పట్టుకున్నాడు. అనంతరం వెంటతెచ్చుకున్న కత్తితో శ్రావణి శరీరంపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో శ్రావణి కిందపడిపోయింది. కొన ఊపిరితో ఉన్న ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం బైక్ నుంచి ఖాళీ బాటిల్ లో పెట్రోల్ తీసి శ్రావణి డెడ్ బాడీపై చల్లీ దహనం చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా షాద్ నగర్ కు వెళ్లి మిత్రుడికి బైక్ హ్యాండోవర్ చేసి బస్సులో హైదరాబాద్ కు వెళ్లాడు.
కత్తి మూసిలో.. మొబైల్ దుర్గం చెరువులో..
ఎంజీబీఎస్ వద్ద ఉన్న మూసీ నదిలో హత్యకు ఉపయోగించిన కత్తిని పడేశాడు శ్రీశైలం. పదే పదే ఫోన్లు వస్తుండడంతో భార్య ఫోన్ ను కేబుల్ బ్రిడ్జీ వద్ద దుర్గం చెరువులోకి విసిరేశాడు. ఇక ఇంటికి వచ్చిన పిల్లలకు తల్లి కనిపించకపోవడంతో ఇంటి ఓనర్ సహాయంతో శ్రావణి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మరునాడు శ్రావణి తండ్రి చంద్రయ్య తన కూతురు కనపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. ఇక పోలీసుల విచారణ విషయం తెలుసుకున్న శ్రీశైలం నేరుగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జరిగిన హత్యోదోంతం మొత్తం వివరించాడు. తానే తన భార్య శ్రావణిని హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని తీసుకొని ఘటనస్థలికి వెళ్లిన పోలీసులు దాదాపుగా దహనం అయిన శ్రావణి డెడ్ బాడీని గుర్తించి తల్లితండ్రులకు అప్పగించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
తమ కూతురి మాదిరిగానే వాడిని చేయాలి
శ్రావణిని హత్య ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. మరోవైపు తల్లి, తండ్రి ఇద్దరికి దూరమైన ఇద్దరు చిన్నారులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మేము మా బిడ్డ దగ్గరికి రావడం శ్రీశైలంకు ఇష్టం లేదని ఆమె పేరెంట్స్ చెబుతున్నారు. పిచ్చి అనుమానంతోనే నా బిడ్డను ప్రాణాలు తీశాడని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఫోన్ ఎత్తడం లేట్ అయినా నా బిడ్డను అనుమానించేవాడని చెప్పారు. గతంలోనే ఒకసారి శ్రావణి హత్య చేయాలని చూసాడని నాడు ఆమె తప్పించుకున్నారు. కనీసం చివరి చూపు కూడా చూసుకొనివ్వలేదని… వాడికి కఠిన శిక్ష వేయాలి శ్రావణి తల్లి తండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ఇంకా ఎవరైన సహకరించారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ కుమార్తె కడసారి చూపునకు నోచుకోకుండా చేసిన శ్రీశైలంకు కఠిన శిక్షలు వేయాలని శ్రావణి తల్లితండ్రులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
