AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రేషన్ కార్డుల కొత్త నిబంధనలు ఏంటంటే..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై తాజాగా స్పష్టతం వచ్చింది.

Telangana: తెలంగాణలో  రేషన్ కార్డుల కొత్త నిబంధనలు ఏంటంటే..!
New Ration Cards
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 10, 2024 | 5:42 PM

Share

రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. అయితే అందుకు విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయించారు. శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘము సమావేశమై తెల్ల రేషన్ కార్డు మంజూరీపై నిశితంగా చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘము సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజనరసింహా,రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నరకు లోపు ఆదాయం, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు… అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘము ముందుకు వచ్చిందన్నారు.

కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఉపసంఘము చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు.అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉప సంఘము చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయా న్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..