Hyderabad Rains: అయ్యో..పోలీస్ స్టేషన్ లో మోకాలి లోతు వర్షపు నీరు.. రంగంలోకి దిగిన ఖాకీలు

వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ మహానగరం పరధిలో కుండపోత వర్షం నగరవాసులను అతలాకుతలం చేసింది.

Follow us
Balaraju Goud

|

Updated on: Aug 20, 2024 | 9:03 AM

వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ మహానగరం పరధిలో కుండపోత వర్షం నగరవాసులను అతలాకుతలం చేసింది. కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. వర్షానికి నాచారంలోని నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చైతన్యపురి​ పోలీస్ స్టేషన్​ జలమయమైంది. సిబ్బంది నీటిని బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోమవారం(ఆగస్ట్ 19) రాత్రి నుంచి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు.. రోడ్లపై భారీ నీరు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలోకి నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. బైకులు, కార్లు కొట్టకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను బయటకు రానివ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.