Gulab Cyclone: తీరం దాటిన గులాబ్.. తెలంగాణలో నేడు కుంభవృష్టి.. రేపు భారీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
Gulab Cyclone: గులాబ్ తుఫాను వణికిస్తోంది. ఆదివారం రాత్రి తీరం దాటిన ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం..

Gulab Cyclone: గులాబ్ తుఫాను వణికిస్తోంది. ఆదివారం రాత్రి తీరం దాటిన ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుఫాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. విద్యుత్ శాఖ కూడా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
రెడ్ అలర్ట్ జారీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో సోమవారం తెలంగాణలో అత్యంత భారీ కుంభవృష్టి, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్‌అలర్ట్ జారీ చేసింది. కుంభవృష్టి వర్షాలు పడతాయనే సూచనలుంటే ఎరుపు, భారీ వర్షాలైతే ఆరెంజ్, ఓ మోస్తరు వర్షాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది వాతావరణ శాఖ. సోమవారం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 29 నాటికి బెంగాల్ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా. సోమవారం తెలంగాణలో 40 కి.మీ. వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రాణ, ఆస్తినష్టాలు నివారించాలి: సీఎస్
తుఫాను నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్, కార్యదర్శి సందీప్ సుల్తానియా, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. వాగుల వద్ద వరద సమయంలో ప్రజలు, వాహనాలు దాటకుండా చూడాలన్నారు.
తుఫానుతో వణికిన ఉత్తరాంధ్ర:
గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల వద్ద తీరం దాటింది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వానలు ముంచెత్తాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయనగరం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి.