PM Digital Health Mission: నేడు డిజిటల్ హెల్త్ మిషన్ స్కీమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Digital Health Mission: దేశ వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు వీలుగా కేంద్ర సర్కార్ జాతీయ స్థాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలు..
PM Digital Health Mission: దేశ వ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు వీలుగా కేంద్ర సర్కార్ జాతీయ స్థాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో నమోదు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యు, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు.
పీఎం-డీహెచ్ఎమ్ అంటే ఏమిటి?
పీఎం-డీహెచ్ఎమ్ అంటే (ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్) కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందజేస్తారు. ఇది బ్యాంకు ఖాతా ఎలా పనిచేస్తుందో అలాగే, వారి ఆరోగ్యానికి సంబంధించి ఒక ఖాతాగా పనిచేస్తుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ హెల్త్ ఐడీ నమోదు చేయగానే స్వయం చాలకంగా మీ పూర్తి ఆరోగ్య సమాచారం వైద్యులకు కనిపిస్తుంది. ఒకవేల కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో నమోదు చేస్తారు.