Telangana Power Policy: నిరంతర విద్యుత్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్.. కొత్త పాలసీ రూపకల్పన!

ఏడాదికేడాది పెరుగుతున్న విద్యుత్తు అవసరాల దృష్ట్యా.. అందుకు సరిపడే విద్యుత్తు ఉత్పత్తి, కొనుగోళ్లపై కొత్త పాలసీ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్తు చట్టాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తోంది.

Telangana Power Policy: నిరంతర విద్యుత్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్.. కొత్త పాలసీ రూపకల్పన!
Telangana Power Policy
Follow us

|

Updated on: Apr 02, 2024 | 7:22 AM

ఏడాదికేడాది పెరుగుతున్న విద్యుత్తు అవసరాల దృష్ట్యా.. అందుకు సరిపడే విద్యుత్తు ఉత్పత్తి, కొనుగోళ్లపై కొత్త పాలసీ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్తు చట్టాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తోంది. వినియోగదారులపై ఎక్కువ భారం లేకుండా దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా ముసాయిదా తయారీకి కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో 2,032 వరకు అవసరమయ్యే భవిష్యత్తు విద్యుత్తు అంచనాలతో కొత్త పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠంగా 15,623 మెగావాట్ల విద్యుత్తు పీక్ లోడ్ డిమాండ్ ఉంది. 2031–32 సంవత్సరం నాటికి 27059 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటుందనేది విద్యుత్తు సంస్థల అంచనా. భవిష్యత్తు అవసరాలకు విద్యుత్తు కొరత లేకుండా అధిగమించే ఏర్పాట్లు, వ్యూహాలకు కొత్త పాలసీ ప్రాధాన్యమిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్తు చట్టాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తోంది. తక్కువ ధరలో విద్యుత్తు ఉత్పత్తి చేయటం, పునరుత్పాదక విద్యుత్తు తయారీ, సరఫరాను ప్రోత్సహించటం, తక్కువ ధరకు విద్యుత్తు సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించటం, ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యాలతో కొత్త పాలసీని తయారు చేయిస్తోంది. వినియోగదారులపై ఎక్కువ భారం లేకుండా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఎక్కువ మొత్తంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించి ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తితో బహుళ ప్రయోజనాలున్నాయి. రెండేండ్లలోనే ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని విద్యుత్తు అవసరాలన్నీ సౌర విద్యుత్తు ద్వారానే అందుకోవాలని, దీంతో మిగతా మార్గాల ద్వారా వచ్చే ఖరీదైన విద్యుత్తు అవసరం తగ్గుతుందని భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్లను నెలకొల్పేందుకు కొత్త పాలసీలో అత్యధిక ప్రాధాన్యమివ్వనుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల అధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తోంది. సోలార్ ప్లాంట్లకు ముందుకు వచ్చే అన్ని ప్రైవేటు కంపెనీలను, వ్యక్తులను భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆఫీసు భవనాలపైనా సోలార్ యూనిట్లు నెలకొల్పే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

రాష్ట్రంలో ఉన్న మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంప్డ్ స్టోరేజీ విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయని విద్యుత్తు సంస్థలు గతంలోనే అంచనా వేశాయి. తక్కువ ధరతో పాటు లాభసాటి వ్యాపార మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను కొత్త పాలసీ ప్రాధాన్యమివ్వనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్తు ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయి. ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయి. పెట్టుబడుల భారం తగ్గేందుకు ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం తీసుకోవాలని, అక్కడ తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇక్కడ సరఫరా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని యోచిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఢిల్లీలో హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్‌తో అందుకు సంబంధించిన సంప్రందింపులు జరిపినట్లు తెలిసింది.

కొత్త విద్యుత్తు విధాన ముసాయిదా బిల్లుపై విస్తృతంగా చర్చించాలని, వివిధ రంగాల నిపుణులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు సూచనలన్నీ స్వీకరించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ చర్చలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త విద్యుత్తు విధాన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో పెట్టే అవకాశముంది. తెలంగాణలో పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలకు గుది బండగా మారాయంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ప్రత్నామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…