Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు నగదు జమ ఎప్పటినుంచంటే..?
Telangana Rythu Bandhu: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో విడత రైతుబంధును రేపటినుంచి జమచేయనున్నట్లు వెల్లడించింది.

Telangana Rythu Bandhu: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో విడత రైతుబంధును రేపటినుంచి జమచేయనున్నట్లు వెల్లడించింది. రైతుబంధు నిధులు రూ.7676.61 కోట్లను జమచేయనున్నట్లు వెల్లడించింది. అర్హులయిన 70.54 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రేపటి నుంచి ఎకరానికి రూ.5 వేలు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు యాసంగి రైతుబంధు అందించనుంది. మొత్తం పదో విడతతో రూ.65,559.28 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ.7434.67 కోట్లు రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేసింది. అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగునీళ్లు ఇలా రైతుల హక్కుల కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు.
దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారంటూ విమర్శించారు. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు పింఛను, పంటలకు మద్దతుధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారంటూ ఆరోపించారు. రైతుల విషయంలో పాలకుల దృక్పధం మారాలని తెలిపారు.
రేపటి నుండి పదో విడత రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..