Telangana: తెలంగాణ సర్కార్ సరికొత్త ఆలోచన.. ఇక వారికి పండగే పండగ
FISH PONDS: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో చేపల కొలనులను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. తద్వారా స్థానిక రైతులకు, మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరులను సృష్టించాలని నిశ్చయించింది.

ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు చెరువులు, శిఖం భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేపల కొలనులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉపాది హామీ పథకం కింద గ్రామాల్లో చెరువులను తవ్వించడంతో గ్రామస్తులకు ఉపాధితో పాటు ..మత్స్యకారుల ఆదాయాన్ని అంధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.
ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ అధికారులు తమ పరిధిలోని చెరువులు, కుంటల సందర్శించి..చేపల కొలనుల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తిస్తారు. ఆ తర్వాత స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారుల అనుమతులు తీసుకుంటారు. ఇదంతా పూర్తైన తర్వాత ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు పంపి అక్కడ ఆమోదం లభించిన తర్వాత పనులు చేపడతారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద 13కోట్ల పనిదినాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక్కో గ్రామంలో 3,300 పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొలనుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ చేపల కొలనులను చెరువుకు 100 నుంచి 300 మీటర్ల దూరంలో నిర్మించనున్నారు. 14 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతులో చేపల కొలనులు నిర్మించనున్నారు. చెరువులకు సమీపంలో నిర్మాణాలు చేపట్టడంతో పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.
చేపల కొలనుల ఏర్పాటతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు ఆక్రమణల నుంచి చెరువులు, శిఖం భూములను రక్షించడంతో పాటు ప్రభత్వం అందించే చేపపిల్లను కూడా ఇందులో పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.