AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బిచ్చగాడినంటూ ఇంట్లోకి దూరాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడుతున్న అమాయకులను టార్గెట్ గా చేసుకొని కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. పూజలతో మనుషులకే కాదు పశువులకు కూడా రోగాలను నయం చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకుల నుండి అందిన కాడికి బంగారాన్ని దండుకుంటున్నారు. ఆ వివరాలు..

Telangana: బిచ్చగాడినంటూ ఇంట్లోకి దూరాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..
Beggar
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 17, 2025 | 9:38 AM

Share

సూర్యాపేటలోని సీతారాంపురంకు చెందిన దేవరం పూలమ్మ పాడి గేదెను మేపుతూ, పాలు విక్రయిస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఇటీవల పాడి గేదె అనారోగ్యం బారినపడింది. కుటుంబ పోషణకు దిక్కుగా ఉన్న పాడి గేదె అనారోగ్యం బారినపడటంతో పూలమ్మ ఆందోళన చెందింది. ఇదే సమయంలో నెల కిందట బిక్షాటన చేసే ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చి మీ ఇబ్బందులుంటే చెప్పండి, ప్రత్యేక పూజలు చేసి సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికాడు. అతడు వెళ్లిన వారం రోజులకు గుర్తు తెలియని మహిళ పూలమ్మ ఇంటికి వచ్చి.. మీ పాడిగేదె అనారోగ్యం బారిన పడిందని చెప్పింది. మీరంటే గిట్టని వారు మంత్రాలు చేశారని.. బాగుచేస్తామని, అందుకు పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పి వెళ్లిపోయింది. మళ్ళీ వారం రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తి పూలమ్మ ఇంటికి వచ్చి తాను చేసే పూజలు, తన వద్ద ఉన్న నూనెతో పాడి గేదె అనారోగ్యం, మోకాళ్ల నొప్పులు పోతాయని నమ్మ బలికాడు. దీంతో పూజలు చేయించుకునేందుకు పూలమ్మ అంగీకరించింది.

అతడు చెప్పినట్లు రెండు గిన్నెల్లో బియ్యం తీసుకుని వచ్చింది. ఏవో మంత్రాలు చదివాక పూలమ్మ మెడలోని 3 తులాల బంగారు ఆభరణంతో పాటు చేతికి ఉన్న అరతులం ఉంగరాన్ని గిన్నెలోని బియ్యంలో పెట్టాలని సూచించాడు. అతడు చెప్పినట్లే పూలమ్మ బంగారు ఆభరణాలను గిన్నెలో వేసింది. కొన్ని పూజలు చేస్తున్నట్లు నటించిన బురిడి బాబా ఇంట్లోకి వెళ్లి దేవుడి చిత్ర పటాల వద్ద దండం పెట్టుకొని రావాలని పూలమ్మకు సూచించాడు. అదే సమయంలో గిన్నెలోని బంగారు ఆభరణాలను మాయం చేశాడు. పూజలు చేసిన బియ్యాన్ని వెంటనే పట్టుకోవద్దని గంట తర్వాత కదిలించాలని చెప్పాడు.

తన సంచి నుంచి ఒక నూనె సీసాను పూలమ్మకు ఇచ్చి పాడి గెదె వీపుపైన, పూలమ్మ మోకాళ్లపై రాసుకోవాలని సూచించి వెళ్లిపోయాడు. అతడు చెప్పినట్లుగానే గంట తర్వాత పూలమ్మ బియ్యం గిన్నెను తెరిచి చూసి షాక్ అయింది. గిన్నెలో తాను వేసిన బంగారు గొలుసు, చేతి రింగు లేవు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పూలమ్మ.. సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పూలమ్మను బురిడి కొట్టించిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.