Hyderabad: వాహనదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పనిలేదు..
హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.77.31 కోట్లుతో కొత్త ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. GHMC ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థతో రద్దీని తగ్గించి, వాహనాల కదలికలను సులభతరం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, కొత్త సిగ్నళ్ల ఏర్పాటు కోసం రూ.77.31 కోట్ల నిధులను మంజూరు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులతో నగరవ్యాప్తంగా ఉన్న 404 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణతో పాటు కొత్త సిగ్నళ్ల సరఫరా, ఏర్పాటు, టెస్టింగ్, కమిషనింగ్ పనులు చేపట్టనున్నారు. మొత్తం పనులను ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్ల ద్వారా పారదర్శకంగా కేటాయించనున్నారు. సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్తగా కుదిరే ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐబీఐ గ్రూప్ (1) ప్రైవేట్ లిమిటెడ్తో ఉన్న ఒప్పందం ఈ నెల జూలై 29తో ముగియనుంది. దీంతో కొత్త సంస్థ ఎంపిక కోసం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
కొత్త సిగ్నళ్లు, మెరుగైన నిర్వహణతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు జంక్షన్ల వద్ద వాహనాల కదలికలు మరింత సులభతరం అవుతాయని భావిస్తున్నారు. టెండర్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సాంకేతిక సామర్థ్యం, ఆర్థిక అర్హత, సేవల నాణ్యత ఆధారంగా తుది సంస్థను ఎంపిక చేసి, నగర ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




