Hyderabad: ఫ్రీగా కుక్క పిల్లలు.. హైదరాబాద్‌లో డాగ్స్ దత్తత డ్రైవ్.. ఏ రోజు అంటే..?
జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 17న బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ప్రత్యేక దత్తత డ్రైవ్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ డ్రైవ్ జరుగుతుంది. కుక్కలను దత్తత తీసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదు. కావాల్సిన వాళ్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ మధ్య కాలంలో కుక్క దాడి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కుక్కల దాడుల్లో ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదేవిధంగా వీధుల నుంచి కుక్కలను తరలించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధుల్లో కుక్కలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న రీతిలో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బీ ఏ హీరో, అడాప్ట్ డోంట్ షాప్.. అనే నినాదంతో ఈ నెల 17న బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ప్రత్యేక దత్తత డ్రైవ్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ డ్రైవ్ జరుగుతుంది. దీనిలో దత్తత కోసం ఉంచిన కుక్కపిల్లలకు ఇప్పటికే డివార్మింగ్ చేసి, టీకాలు వేశారు. ఇవి పూర్తిగా ఆరోగ్యంగా ఉండగా.. మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిని దత్తత తీసుకునేందుకు ఎలాంటి ఫీజు ఉండదని, కావాల్సిన వాళ్లు తీసుకోవచ్చని తెలిపారు.
దత్తత డ్రైవ్ లక్ష్యం..
నగరంలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంతో పాటు వాటికి ప్రేమగల వాతావరణం కల్పించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈ డ్రైవ్‌లో దత్తత తీసుకునే కుక్కపిల్లలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, టీకాలు వేసిన తర్వాతే అప్పగిస్తారు. పెంపుడు జంతువులను కొనడం కంటే దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరింది.
మంచి స్పందన..
ఈ డ్రైవ్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. జంతు ప్రేమికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ దత్తత కార్యక్రమం వీధి కుక్కపిల్లలకు కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా.. వాటిని దత్తత తీసుకునే కుటుంబాలకు మంచి స్నేహితులను అందిస్తుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
