Gadwal MLA Returns: చేరిన నెలలోపే ఎమ్మెల్యేకు హస్తంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయా?

చేరుతున్నానని చెప్పాడు... కండువా కప్పుకున్నాడు.. ఇప్పుడేమో గులాబీ గూటిలోనే ఉన్నానని అంటున్నాడు. చేరికను అందరూ ఊహించినా.. ఘర్ వాపసీని మాత్రం ఎవరు అంచనా వేయలేదు. అసలే నడిగడ్డ పాలిటిక్స్.. ప్రజలే కాదు.. పొలిటీషియన్స్ సైతం భిన్నమైన తీర్పునిస్తున్నారు.

Gadwal MLA Returns: చేరిన నెలలోపే ఎమ్మెల్యేకు హస్తంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయా?
Gadwal Mla Bandla Krishnamohan Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 30, 2024 | 6:24 PM

చేరుతున్నానని చెప్పాడు… కండువా కప్పుకున్నాడు.. ఇప్పుడేమో గులాబీ గూటిలోనే ఉన్నానని అంటున్నాడు. చేరికను అందరూ ఊహించినా.. ఘర్ వాపసీని మాత్రం ఎవరు అంచనా వేయలేదు. అసలే నడిగడ్డ పాలిటిక్స్.. ప్రజలే కాదు.. పొలిటీషియన్స్ సైతం భిన్నమైన తీర్పునిస్తున్నారు. చేరిన నెలలోపే ఎమ్మెల్యే బండ్లకు హస్తంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయా? లేక చేరి చేసేది ఏమీ లేదని తిరిగి వస్తాననంటున్నారా..? గద్వాల్ లో ఏం జరుగుతోంది.

సరిగ్గా నెల తిరగలేదు.. అప్పుడే ఆయనకు హస్తం పార్టీపై అసంతృప్తి పుట్టుకొచ్చింది. ఎందుకు వెళ్లారో తెలియదు.. ఎందుకు ఉన్నారో తెలియదు..? ఎందుకు వచ్చానని చెబుతున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు..? తీరా తాను కాంగ్రెస్ కండువానే కప్పుకోలేదంటున్నారు. సైలెంట్ అయ్యాయని భావిస్తున్న గద్వాల్ పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అనూహ్యా పరిణామాలు ఆసక్తికర టర్న్ తీసుకుంటూ కాక రేపుతున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిన రెండు స్థానాలు నడిగడ్డలోని అలంపూర్, గద్వాల్ మాత్రమే.. అలంపూర్ నుంచి విజేయుడు, గద్వాల్ నుంచి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఇంత వరకు బాగానే ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గద్వాల్ ఎమ్మెల్యే కు ఎనలేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ఆయనను కంటిమీద కునుకు లేకుండా చేసింది.

ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ ను వీడే కంటే ముందు వరకు సరితా తిరుపతయ్య జడ్పీ ఛైర్ పర్సన్ గా నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. పోలీసు, రెవెన్యూ, వైద్య ఇలా ఏ శాఖ అధికారులైన ఆమె చెబితేనే వినే పరిస్థితి తీసుకొచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేని కాదని ఆమె కీలక పాత్ర పోషించింది. అలాగే అధికార యంత్రాంగం అంతా ఆమె చేతిలోనే ఉండడంతో తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు సైతం ఎమ్మెల్యే ను కాదని ఆమె దగ్గరికి క్యూ కట్టారు. దీంతో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం లేకుండా చేశారట.

అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ లో చేరితే ఆ ఆధిపత్యం ఏదో తానే నిర్వహించవచ్చనే ఆలోచనతోనే బండ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని టాక్. ఈ క్రమంలో చేరికల సంప్రదింపులు ముందుగానే బహిర్గతం కావడంతో నియోజకవర్గ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేరికను అడ్డుకునేందుకు సరితా తిరుపతయ్య, అనుచరులు విశ్వప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంతో పాటుగా ఏకంగా హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సరితా తిరుపతయ్య కార్యకర్తలతో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి వద్ద కంటతడి కూడా పెట్టుకున్నారు.

ఎట్టకేలకు అడ్డంకుల అన్నింటినీ తొలగించుకొని ఈ నెల 6వ తేదినే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అనంతరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు. కానీ పార్టీలో మాత్రం ఆయనను కుదురుకోనివ్వడం లేదట. పాత కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆయన వెంబడి కలిసి రాలేదట. దీనికి తోడు ఆయనతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ పెద్దగా కాంగ్రెస్ లో చేరింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే హస్తం పార్టీలో ఎమ్మెల్యే బండ్ల ఏకాకి అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

బండ్ల అసంతృప్తికి మరో కారణం సైతం ఉందని తెలుస్తోంది. తన ప్రత్యర్థిగా ఉన్న సరితా తిరుపతయ్యను పార్టీలో జీరో చేయడంతో పాటుగా ఆమెకు ఎలాంటి అధికార పదవీ ఇవ్వకూడదనే కండీషన్ మీదే ఎమ్మెల్యే బండ్ల పార్టీలో చేరాడంటూ మొదట టాక్ నడిచింది. అందులో భాగంగానే ఎప్పుడో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సిన బండ్ల చేరికకు ఆలస్యం అయిందట. తాజాగా బండ్ల చేరిక సందర్భంగా సరితా తిరుపతయ్య అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పదవీ హామీ ఇచ్చారని తెలిసింది. విషయం బండ్లకు తెలిసినప్పటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చర్చలు నడుస్తున్నాయి.

వరుస చేరికలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ కే షాక్ ఇచ్చేలా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. చేరిక సందర్భంలో ఎమ్మెల్యే బండ్ల, సరితా తిరుపతయ్య ను సమన్వయం చేయకపోవడం కూడా ఈ హఠాత్తు పరిణామానికి దారి తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..