Hyderabad: దారుణం.. 4ఏళ్ల నుంచి నో రెంట్.. ఖాళీ చేయమంటే ఎంతకు తెగించాడంటే..?
అపార్ట్‌మెంట్ లోని ఫ్లాట్లను హాస్టల్ నిర్వహణ కోసం అద్దెకు ఇవ్వడమే ఆ ఓనర్‌కు శాపమైంది. ఫ్లాట్లకు రెంట్ ఇవ్వకపోగా.. ఖాళీ చేయమంటే హాస్టల్ నిర్వాహకుడు దాడికి దిగాడు. ఖాళీ చేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ససేమీరా అంటూ ఓనర్‌పై అటాక్ చేశాడు. గచ్చిబౌలిలో ఈ ఘటన సంచలనంగా మారింది.

గచ్చిబౌలి నెక్స్ట్ జెన్ హాస్టల్ వివాదం ముదిరింది. ఐదేళ్ల క్రితం పిచ్చయ్య అనే వ్యక్తి అమర్ నాథ్ రెడ్డికి 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు. హాస్టల్ కోసం ఈ ప్లాట్లను తీసుకున్న అమర్నాథ్.. నెక్స్ట్ జెన్ లేడీస్ హాస్టల్ పేరిట హాస్టల్ నిర్వహించుకుంటూ వస్తున్నాడు. అయితే కరోనా తర్వాత అపార్ట్ మెంట్ అద్దె చెల్లించకుండా హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి మొండికేశాడు. అపార్ట్‌మెంట్ యజమాని పలు మార్లు హెచ్చరించినా అద్దె చెల్లించలేదు. హాస్టల్ ఖాళీ చేయాలనడంతో అమర్నాథ్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాని కూడా కోర్టుకు వెళ్లాడు.
ఈ అంశంపై విచారణ తర్వాత 9 ప్లాట్లు ఖాళీ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల సహకారంతో ఇంటి యజమాని 9 ప్లాట్లను ఖాళీ చేయించాడు. తాజాగా మరో మూడు ఫ్లాట్లు ఖాళీ చేయాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో మూడు ప్లాట్లు ఖాళీ చేయిస్తుండగా హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి పిచ్చయ్యపై అటాక్ చేశాడు. దాడిలో ఓనర్ పిచ్చయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. బిల్డింగ్ ఓనర్ రక్తపు మరకలతోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. హాస్టల్ యజమాని అమర్నాథ్‌పై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్లాట్స్ ఖాళీ చేయించడానికి వెళ్లిన అడ్వొకేట్‌పై సైతం హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి దాడి చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అమర్నాథ్ రెడ్డిని పోలీసులు కావాలనే బయటకు పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. అమర్నాథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. కోర్ట్ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న అమర్నాథ్‌ను విడిచిపెట్టొద్దంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
