AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

సురేందర్, నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆర్మీ, బీఎస్ఎఫ్ లో చేరాలనే కలతో ఉన్నాడు. అయితే ఆ కల నెరవేరకపోవడంతో, ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అతని కృషికి ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలిపారు.

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం
Cm Revanth And Surender
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 12:29 PM

Share

ఆర్మీలో చేరాలనుకున్నా.. అదృష్టం వరించలేదు. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం చేయాలనుకున్నా.. కాలం కలిసిరాలేదు. అయినా ఏదో సాధించాలనే తపన ఆ యువకుడిలో ఏమాత్రం తగ్గలేదు. అనూహ్యంగా రైఫిల్‌ షూటింగ్‌ రంగాన్ని ఎంచుకుని.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకాలను ముద్దాడాడు. ఇప్పుడు ఏకంగా ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కూడా రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. మరి ట్రైనీ నుంచి ట్రైనర్‌గా ఎదిగి సీఎం రేవంత్‌రెడ్డి మన్ననలు పొందిన మారుమూల తండా యువకుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిరుపేద కుటంబం.. అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు.. వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు.. అవేవీ అడ్డుగోడగా భావించలేదు ఆ యువకుడు. ఆర్మీలో చేరాలనుకున్నా, బీఎస్‌ఎఫ్‌లో పనిచేయాలనుకున్నా..ఆ ఆశలూ నెరవేరలేదు. అయినా భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నాలను ఎప్పుడూ ఆపలేదు. చివరకు క్రీడారంగంలో అడుగుపెట్టి.. ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో సత్తాచాటుతున్నాడు మారుమూల తండాకు చెందిన ఈ యువకుడు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్ మండలం చందునాయక్‌ తండాకు చెందిన గుగ్లావత్ కళాబాయి- బలిరాం దంపతుల కుమారుడు సురేందర్. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. డిగ్రీ వరకు చదువుకున్న సురేందర్‌, తొలుత అటవీశాఖలో చిన్న కాంట్రక్ట్‌ ఉద్యోగిగా పనిచేశాడు. ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లో చేరాలని సాధన చేసేవాడు. కానీ ఆ కల నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఓసారి హైదరాబాద్‌లో ఉన్న తన బావ వద్దకు వచ్చాడు. సికింద్రాబాద్‌లో అతను కోచ్‌గా పనిచేస్తున్న రైఫిల్‌ షూటింగ్‌ కేంద్రాన్ని సురేందర్‌ సందర్శించాడు. బావ ప్రోత్సాహంతో అప్పటి నుంచి సురేందర్‌లో ఆ క్రీడపై ఆసక్తి కలిగింది. దీంతో అటవీశాఖలో తాను చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికిన సురేందర్ సికింద్రాబాద్‌ వచ్చి రైఫిల్ షూటింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఆర్థికంగా బలంగా లేకపోవడంతో ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ఓ వైపు ఉద్యోగం, మరోవైపు శిక్షణను బ్యాలెన్స్‌ చేసుకునేవాడు. అలా కొన్నినెలల్లోనే సురేందర్ రైఫిల్‌ షూటింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. అనంతరం ఎక్కడ పోటీలు జరిగినా అక్కడ వాలీపోయేవాడు.

సురేందర్‌ తొలుత షిరిడీలో జాతీయ స్థాయి ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. అప్పుడు 17 రాష్ట్రాలు తలపడ్డాయి. ఆ తర్వాత గోవాలో జాతీయస్థాయి పోటీల్లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌ మెడల్, టీంతో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇటీవల ఖేలో భారత్ యూత్‌ గేమ్స్‌ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ 2024లో నేపాల్‌ రంగశాల వేదికగా జరిగిన అంతర్జాతీయ పోటీల్లోనూ సురేందర్‌ పాల్గొన్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో మొత్తం 17 దేశాలు తలపడగా ఇండోనేపాల్‌పై గెలిచి సురేందర్ బంగారు పథకం సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్‌తో పాటు టీంతో మరో గోల్డ్‌ మెడల్‌ను సాధించాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు సురేందర్‌ను ప్రశంసించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..