Koppula Harishwar Reddy: మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..
Koppula Harishwar Reddy: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (76) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి హరీశ్వర్ రెడ్డికి గుండెపోటు రాగా.. ఆయన కుటుంబసభ్యులు పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
Koppula Harishwar Reddy: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (76) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి హరీశ్వర్ రెడ్డికి గుండెపోటు రాగా.. ఆయన కుటుంబసభ్యులు పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డి.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. కాగా.. హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి.. పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్ చైర్మన్‌గా సేవలందించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గం నించి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, మంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్వరరెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కేటీఆర్, హరీష్ రావు సంతాపం..
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్ రెడ్డి పరిగి ప్రాంతానికి ఎంతగానో సేవలు అందించారన్నారు. హరీశ్వర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని కేటీఆర్ ప్రార్థించారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే గా గెలిచి, ఉప సభాపతిగా, సీనియర్ రాజకీయ నేతగా గొప్ప సేవలందించారన్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం