Telangana Rains: తెలంగాణలో రికార్డు స్థాయిలో కురిసిన వాన.. పొంగుతున్న వాగులు, వంకలు

గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.

Telangana Rains: తెలంగాణలో రికార్డు స్థాయిలో కురిసిన వాన.. పొంగుతున్న వాగులు, వంకలు
Heavy Rains In Telangana
Follow us

|

Updated on: Sep 05, 2021 | 5:18 PM

తెలంగాణలో అల్పపీడనం ఎఫెక్ట్‌తో గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు పడ్డాయి. రికార్డుస్థాయిలో వాన కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌,మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, రంగారెడ్డిజిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పలుజిల్లాలో పంటపొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వాగులు పోటెత్తడంతో లోలెవెల్‌ వంతెనలు ప్రమాదకరంగా మారాయి.

మహబూబ్‌నగర్‌ పట్టణంలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా బికె రెడ్డి కాలనీ, బిఎన్ రెడ్డి కాలనీ, రామయ్యబౌలీ, శివశక్తి నగర్, ఎనుగొండ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కాలనీల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. ఇళ్లల్లోకి కూడా నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడిమెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వేల ఎకరాల్లో వరి, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. రాయికోడ్ మండలంలోని ఇటికేపల్లి, నాగ్వార్, హుల్లెరా సహా మరో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణఖేడ్ డివిజన్ లో రోడ్లు దెబ్బతిన్నాయి. మనోహరాబాద్ మండలం రామాయంపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నీట మునిగింది.

సిద్దిపేటజిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. చిన్నకొడూరు మండలం గోనెపల్లివాగులో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైనవారిని తోమర్‌సింగ్, సురేష్‌గా గుర్తించారు. మోయతుమ్మెద వాగుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. సిరిసిల్ల పట్టణంలో రాత్రి కుంభవృష్టి కురిసింది. పాతబస్టాండ్‌ సమీపంలోని కాలనీలన్నీ చెరువును తలపించాయి. కొత్తచెరువు మత్తడి దూకడంతో ఇళ్లలోకి వరదనీరు చేరింది . దాంతో చేపలు కొట్టుకొచ్చాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. డ్యామ్ 14 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్ లోకి10312 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 14, 664 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు.

మంచిర్యాలజిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. లక్షేట్టిపేట మండలం శాంతాపూర్‌ దగ్గర వర్షానికి భారీవృక్షం నేలకూలింది. దాంతో మంచిర్యాల-లక్షేట్టిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడిరంగారెడ్డిజిల్లాలోనూ పలుచోట్ల రాత్రినుంచి కుండపోత వర్షం పడుతోంది. ప్రధానంగా వికారాబాద్‌జిల్లా ధారూర్‌ మండలం దోర్నాల్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో కృష్ణ అనే వ్యక్తిని స్థానికులు రక్షించారు. గల్లంతైన గోరప్ప కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లోనూ పలుచోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేటలో వర్షం పడింది. శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Also Read: Bigg Boss 5 Telugu: తనని తాను మార్చుకున్న ప్రియాంకా సింగ్‌కు బిగ్ బాస్ ఓ గోల్డెన్ ఛాన్స్

 టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..?