MLC Election: ప్రశాంతంగా ముగిసిన ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మార్చి 3న తేలనున్న భవితవ్యం
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

గత వారం పది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు.
కృష్ణా- గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇక్కడ టీడీపీ, పీడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా.. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ చేశారు. ఇక.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 10మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే.. ఇక్కడ కేవలం టీచర్స్ యూనియన్స్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో కాసేపట్లో బ్యాలెట్ బాక్స్‌లను విశాఖకు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. ఇదిలావుంటే.. ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకి నోటు అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది.
అటు తెలంగాణలోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. ఇక్కడ మూడు ఎమ్మెల్సీల్లో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో ఒక టీచర్స్ స్థానానికి, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో ఒక టీచర్స్ స్థానానికి.. వరంగల్, ఖమ్మం, నల్గొండలో మరో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. అయితే.. టీచర్స్ ఎమ్మె్ల్సీ స్థానాల్లో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్యే ఫైట్ నడిచింది. అటు.. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక.. ఏపీ, తెలంగాణలో మొత్తంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తవగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..