Weather Report: ఆ 20 మండలాల ప్రజలు జాగ్రత్త! అస్సలు బయటకెళ్లకండి..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో భానుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో.. ప్రమాదకర స్థాయిలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం ఠారెత్తిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో భానుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో.. ప్రమాదకర స్థాయిలో 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం ఠారెత్తిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదౌతోన్న ఉష్ణోగ్రతలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో రాజమండ్రి, ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ, తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల ప్రాంతం భగ్గుమంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 50 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి ఉష్ణోగ్రతలు. వడదెబ్బతో తెలంగాణలో నిన్న ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మరణించారు. హసన్‌పర్తిలో ఒకరు మృత్యువాత పడ్డారు.
20 మండలాల్లో వడగాడ్పులు..
రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు, ఏలూరులో 48, భీమవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7 డిగ్రీలతో నిప్పులవర్షం కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలంలో 42 డిగ్రీలు, కాట్రేనికొనలో 40 డిగ్రీలు, ముమ్మిడివరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే 24 గంటల్లో 20 మండలాల్లో వడగాడ్పులుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మిర్యాలగూడ 47, పాల్వంచలో 46 డిగ్రీలు, వరంగల్, నల్గొండలలో 43, జగిత్యాలలో 44, కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో అడుగు బయటపెట్టాలంటే హడలిపోతున్నారు జనం. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం హడలెత్తిస్తోంది.
రామగుండం ఎప్పటిలానే అగ్నిగుండంలా మారింది. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచిర్యాల జిల్లాలో మండిపోతున్న ఎండలతో సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో పనిచేసే కార్మికులు పనివేళలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వరంగల్, హసన్‌పర్తిలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హసన్‌పర్తిలో వడదెబ్బకు ఓ కూలీ మృతిచెందాడు.
ఇక రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు భగ్గుమంటాయని హెచ్చరించింది ఏపీ వాతావరణ శాఖ.
సూర్య భగవనుడు శాంతించాలని వేడుకుంటూ కాజిపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 12రోజుల పాటు తీవ్రమైన ఎండలు వుంటాయని హెచ్చరించారు ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి.
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..