AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయిన తర్వాత లక్కీడ్రాలో పేరు.. షాపు ఎవరికి..?

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపులకు లాటరీ నిర్వహించింది. ఈ ప్రక్రియలో వింత అనుభవాలు ఎదురయ్యాయి. షాపులు దక్కించుకునేందుకు ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరిస్తే, చనిపోయిన వ్యక్తికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Nalgonda: ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయిన తర్వాత లక్కీడ్రాలో పేరు.. షాపు ఎవరికి..?
Nalgonda Liquor Shop Lotter
M Revan Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 28, 2025 | 5:52 PM

Share

తెలంగాణలో రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నడుపుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా లైసెన్సులను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా దరఖాస్తు దారులను ఎంపిక చేశారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వందలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొంతమంది సిండికేట్ అయి వందల సంఖ్యలోనే అప్లికేషన్లు పెట్టారు. అయితే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన లక్కీ డ్రాలో అదృష్టం కొంతమందిని వరించింది. మద్యం షాపులు దక్కకపోవడంతో చాలామంది నిరాశతో వెనుతిరిగారు. కానీ కొంతమందికి మాత్రం జాక్ పాట్ తగిలింది. కొందరు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టినా నిరాశే ఎదురైంది.

Also Read: నక్కతోక తొక్కిన రాజు యాదవ్.. ఏకంగా 12 మద్యం షాపులు దక్కాయ్..

అయితే నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తికి  లక్కీ డ్రాలో లిక్కర్ షాపు వచ్చినప్పటికీ.. ఆ ఇంట విషాదం వెంటాడింది. మాడుగుల పల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్(38) స్థానిక రైస్ మిల్‌లో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. ఆ రైస్ మిల్ యజమాని అశోక్ పేరిట మద్యం షాపులకు దరఖాస్తులు చేసేవాడు. ఈసారి అశోక్ సొంతంగా మాడుగులపల్లిలోని ఓ మద్యం దుకాణానికి ఈ నెల 18న జిల్లా కేంద్రంలో టెండరు దరఖాస్తు చేశాడు. మూడు రోజుల క్రితం అశోక్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో అశోక్‌ను హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ చనిపోయాడు. దీంతో గోపాలపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే సమయంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక ప్రక్రియ జరిగింది. మాడుగులపల్లిలోని నెంబర్ 63వ షాప్ లక్కీ డ్రాలో అశోక్ పేరిట వచ్చింది. అయితే మద్యం షాపులు దక్కక చాలామంది నిరాశలో ఉంటే.. మద్యం షాపు వచ్చిన విషయం కూడా తెలియకుండానే అశోక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ సంతోశ్ చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..