Telangana: నక్కతోక తొక్కిన రాజు యాదవ్.. ఏకంగా 12 మద్యం షాపులు దక్కాయ్..
తెలంగాణలో లిక్కర్ టెండర్ల డ్రా ముగిసింది. కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే 19 షాపులకు మాత్రం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకు దరఖాస్తుల స్వీకరించి.. నవంబర్ 3న డ్రా తీయనున్నారు అధికారులు.

తెలంగాణలో మద్యం షాపులకు లక్కీడ్రా పూర్తయింది. జిల్లాల వారిగా మద్యం షాపులకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రాలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో విన్నర్స్‌ను ప్రకటించారు. 19మద్యం షాపులకు లక్కీ డ్రా నిలిపివేశారు. 19 షాపులకు సింగిల్ డిజిట్ స్థాయిలో టెండర్లు రావడంతో డ్రా ఆపేశారు. మొత్తం 2వేల 601షాపులకు డ్రా ప్రక్రియ ముగిసింది. పాత షాపుల ఓనర్లకు స్టాక్ క్లియరెన్స్ కోసం నెల రోజుల సమయం ఇచ్చారు. డిసెంబర్1 నుంచి.. కొత్తగా షాపులు దక్కించుకున్న వారి చేతికి వైన్ షాపులువెళ్లనున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో రాజు యాదవ్ అనే వ్యక్తి సిండికేట్‌లో 171 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయగా.. 12 షాపులు దక్కించుకున్నారు. తన స్నేహితులతో కలిసి బృందావన్ పేరుతో మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 171 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేసి 5కోట్ల 13లక్షలు టెండర్లకు చెల్లించారు. పలు జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. అయితే.. ఈసారి ఫీజు చెల్లింపుతో దరఖాస్తుల సంఖ్య తగ్గిందంటున్నారు వ్యాపారులు.
రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 620 దుకాణాలకు 95వేల 137 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం రూ. 3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజును వసూలు చేసింది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2వేల 854 కోట్ల ఆదాయం వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




