Chat GPT: యూజర్ల వయసు అంచనా వేయనున్న టెక్నాలజీ.. హానికరమైన కంటెంట్‌కు ఇక చెక్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చాట్ జీపీటీని తెగ వాడుతున్నారు. చదువు నుండి ఆఫీసు పనుల వరకు అన్నింటికీ ఏఐ మీద ఆధారపడుతున్నాం. అయితే ఈ టెక్నాలజీ కారణంగా ఎంత ప్రయోజనం ఉందో, పిల్లలకు అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఇప్పటివరకు చాట్ జీపీటీలో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన వయసు ఎంతో మనం చెబితేనే అది నమ్మేది. కానీ పిల్లలు అబద్ధం చెప్పి అడల్ట్ కంటెంట్ చూడకుండా అడ్డుకోవడం ఓపెన్ ఏఐకి పెద్ద సవాలుగా మారింది. అందుకే ఇప్పుడు ఆ సంస్థ ఒక వినూత్నమైన టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇకపై మీరు మీ వయసు చెప్పాల్సిన పనిలేదు, చాట్ జీపీటీతో మీరు మాట్లాడే తీరు, మీ అలవాట్లను బట్టి మీరు మైనరా కాదా అనేది ఏఐ స్వయంగా కనిపెట్టేస్తుంది. ఒకవేళ మీరు 18 ఏళ్ల కంటే తక్కువ అని ఏఐకి అనిపిస్తే.. వెంటనే కొన్ని ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఆ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? దీని వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుందాం.
ఎలా పనిచేస్తుంది?
ఓపెన్ ఏఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త సిస్టమ్ కేవలం మీరు టైప్ చేసిన పుట్టిన తేదీ మీద మాత్రమే ఆధారపడదు. యూజర్ల వయసును అంచనా వేయడానికి ఇది అనేక రకాల సంకేతాలను (సిగ్నల్స్) గమనిస్తుంది. ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది? ఎంతకాలంగా వాడుతున్నారు? ఏ సమయాల్లో చాట్ జీపీటీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు? ఎలాంటి సమాచారం కోసం వెతుకుతున్నారు? ఈ అంశాలన్నింటినీ విశ్లేషించి, సదరు యూజర్ మైనరా లేక మేజరా అనేది ఏఐ ఒక అంచనాకు వస్తుంది. కాలక్రమేణా ఈ మోడల్ మరింత కచ్చితత్వంతో పనిచేస్తుందని ఓపెన్ ఏఐ చెబుతోంది.
మైనర్ అని గుర్తిస్తే..
ఒకవేళ ఈ సిస్టమ్ ఏదైనా అకౌంట్‌ను 18 ఏళ్ల లోపు యూజర్‌గా గుర్తిస్తే, వెంటనే ఆ అకౌంట్‌కు అదనపు సేఫ్ గార్డ్స్ యాక్టివేట్ అవుతాయి. టీనేజర్లకు హాని కలిగించే కొన్ని రకాల కంటెంట్‌పై ఆంక్షలు విధిస్తుంది. విపరీతమైన హింస లేదా గ్రాఫిక్ కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తుంది. ప్రాణాపాయం కలిగించే వైరల్ ఛాలెంజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని అడ్డుకుంటుంది.
అనారోగ్యకరమైన డైటింగ్ పద్ధతులు లేదా మానసిక ఒత్తిడి పెంచే బ్యూటీ స్టాండర్డ్స్ ప్రమోట్ చేసే కంటెంట్‌కు ఆస్కారం ఉండదు. అడల్ట్ లేదా వయోలెంట్ రోల్ ప్లే కంటెంట్‌ను పూర్తిగా నియంత్రిస్తుంది. టెక్నాలజీ ఎప్పుడూ నూటికి నూరు శాతం కచ్చితంగా ఉండదు. ఒకవేళ 18 ఏళ్లు పైబడిన వ్యక్తిని కూడా మైనర్‌గా ఏఐ పొరపాటున గుర్తిస్తే, దాన్ని సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ‘పర్సోనా’ అనే సురక్షిత ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్వీస్ ద్వారా ఒక సెల్ఫీ అప్‌లోడ్ చేసి, తమ వయసును నిరూపించుకోవచ్చు. దీని ద్వారా మళ్ళీ పూర్తి యాక్సెస్ పొందవచ్చు.
ఎందుకు ఈ మార్పు?
టీనేజర్ల అభివృద్ధిపై జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ మార్పు చేసినట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది. పెద్దల కంటే టీనేజర్లు ఇతరుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిలో ఉద్వేగ నియంత్రణ తక్కువగా ఉంటుందని, అందుకే వారికి ‘సేఫర్ మోడ్’ అవసరమని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో వచ్చే కొద్ది వారాల్లో ఇది అమలు కానుంది. ఏఐ ప్రపంచంలో పిల్లల భద్రత కోసం ఓపెన్ ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. టెక్నాలజీ కేవలం తెలివితేటలను పెంచడమే కాదు, బాధ్యతాయుతంగా కూడా ఉండాలని ఈ మార్పు నిరూపిస్తోంది.
