బ్రేకింగ్.. ORRపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న కారు.. స్పాట్‌లో నలుగురు మృతి!
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెలినో కారు లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతుల గుర్తింపు, ప్రమాద వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

హైదరాబాద్, జూలై 18: ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు TS07 HW 5858 అనే నంబర్ గల బెలినో కారు లారీని వెనుక వైపు నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పెద్ద అంబర్ పెట్ నుండి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తెల్లవారుజామున 3.26 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పోలీసులు మూడు గంటల పాటు శ్రమించి మృతదేహాలను అతి కష్టం మీద బయటికి తీశారు. మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలోత్ చందు లాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు(40). గాయపడిన వ్యక్తిని బిఎన్ రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ నీలాద్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దాసరి భాస్కర్ మృతి చెందారు. దీంతో ఓ ఆర్ ఆర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కాగా ఈ ప్రమాదంలో ఇన్వాల్వ్ అయిన లారీ అక్కడ లేదు. ప్రస్తుతం పోలీసులు లారీని, డ్రైవర్ కోసం వెతుకుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




