karimnagar: చైనా మాంజాలో చిక్కుకున్న కాకి.. కాపాడిని ప్రయాణికులు..

హిందూ శ్రాద్ధకర్మల్లో కాకిది ప్రత్యేక స్థానం. శ్రాద్ధం పెట్టాక పెద్దలకు పెట్టే పిండాలను కాకులు ముడితేనే.. అవి పెద్దలకు ముట్టినట్టని భావిస్తుంటారు. అలాంటి కాకులు అంతరించిపోతుండటంతో పాటు.. ఏదో పరిష్కారం కాని తెలియని చిక్కులతో ఆత్మలు క్షోభించినప్పుడు పెద్దలకు పెట్టిన పిండాలను కాకులు ముట్టని పరిస్థితులనూ.. ఈమధ్య వచ్చిన బలగం సినిమా మనకు బాగా చూపించింది. అలాంటి కాకిని కాపాడుకోవాలన్న ఓ సంకల్పం మానవ సమాజాన్ని ఒకటి చేసింది. అలాంటి ఘటనే కరీంనగర్ బస్సు స్టాండ్ లో జరిగింది.

karimnagar: చైనా మాంజాలో చిక్కుకున్న కాకి.. కాపాడిని ప్రయాణికులు..
Karimnagar
Follow us
G Sampath Kumar

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 12, 2025 | 9:29 AM

చైనా మాంజాతో ప్రాణాలే పోతున్న ఘటనలు ఈమధ్య తరచూ చూస్తున్నాం. అక్కడక్కడా తీవ్రంగా గాయపడుతున్న సంఘటనల గురించీ వింటున్నాం. అయితే, చైనా మాంజా ఇప్పుడు మనుషులకే కాదు, పక్షుల పాలిటా ప్రాణాంతకంగా మారుతోంది. అలాంటి ఘటనే కరీంనగర్ లో నల్గురినీ కదిలించి ఏకం చేసి ఐకమత్యంతో మానవత్వాన్ని చాటేందుకు హేతువైంది. కరీంనగర్ బస్టాండ్ వద్ద ఓ కాకి చైనా మాంజాకు చిక్కుకుని చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చైనా మాంజా కోసుకుపోతుంటే విలవిలలాడుతున్న కాకిని తూము నారాయణ అనే సోషల్ వర్కర్ చూశాడు. తూము నారాయణకు తోడు, స్థానికులూ, ట్రాఫిక్ పోలీసులూ జతయ్యారు.

ఓ ఆర్టీసి బస్సును ఆపి, విషయాన్ని డ్రైవర్ కు వివరించారు. డ్రై రూ చలించాడు. దాంతో తను బస్సును ఎక్కడైతే కాకి వైర్ల దగ్గర చిక్కుకుపోయిందో.. అక్కడ ఆపాడు. తూము నారాయణతో పాటు, మరికొందరు బస్సుపైకెక్కి, క్షేమంగా, సురక్షితంగా కాకిని కిందకు దింపారు. కాకికి చుట్టుకున్న చైనా మాంజా దారాన్ని ఎలాంటి బాధా కలక్కుండా సున్నితంగా తొలగించారు. కాళ్లకు చుట్టుకున్న దారాన్నీ పూర్తిగా తొలగించి కాకి ఎగరగలదా, లేదా పరిశీలించి.. ఆ తర్వాత స్వేచ్ఛగా గాల్లోకి ఎగురేశారు.

కాకిని రక్షించే క్రమంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఒక్కసారి రోడ్లన్నీ జామ్ అయ్యాయి. అయితే, ట్రాఫిక్ పోలీసులు కూడా మానవత్వంతో ట్రాఫిక్ ను పూర్తిగా నియంత్రించి.. సెంటర్ లో బస్సునాపి, ఆ కాకిని రక్షించడంతో ట్రాఫిక్ లో చిక్కుకున్నవారు, ఏం జరుగుతుందో తెలియక ట్రాఫిక్ జామ్ కు విసుక్కున్నవారు కూడా ఆ తర్వాత హర్షం వ్యక్తం చేశారు. ఐకమత్యంగా మానవత్వం చాటిన ఈ ఘటన కరీంనగర్ వాసులను కదిలించింది.