Telangana Policies: నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న వర్గపోరు.. బస్తీమే సవాల్ అంటున్న ఆ ఇద్దరు నేతలు..
కలిసుంటే కలదు సుఖం అనే పదం,ఆ నియోజకవర్గ నేతలకు అంతగా నచ్చదు కావొచ్చు.. పార్టీలో ఉన్న ఇద్దరి నేతల మధ్య విబేధాలు పెరుగుతూనే పోతున్నాయట..మీ ఇద్దరి మధ్య ఉన్న వైరంతో పార్టీకి నష్టం జరుగుతోంది రా బాబు... అని ఆ పార్టీ క్యాడర్ నెత్తి,నోరు కొట్టుకోని ఎంత చెప్పిన లాభం మాత్రం లేదంట. ఇంతకీ గొడవ అంత ఏ నియోజకవర్గంలో.?ఆ ఇద్దరు నేతలు ఎవరు...?
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ను కంచుకోటలా ఏలిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏళ్లనాటి శనిపట్టినట్టుగా తయారైంది. నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన పార్టీ.. నేతల తీరుతో వెలవెలబోతోంది.ఇక్కడ కీలకనేతలుగా ఉన్న సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి మధ్య.. సలసల కాగుతోంది రాజకీయం. నేనంటే నేనంటూ తలబడుతున్న ఈ నాయకులు.. అస్సలు తగ్గేదెలె అంటున్నారు. ఎవరికి వారే యమునతీరే అన్నట్టుగా.. పార్టీని చెరోవైపు లాక్కెళ్తున్నారు. వీళ్లిద్దరి మధ్యా జగడం.. కొత్తేం కాదు. నియోజకవర్గం ఏర్పడ్డకాణ్నుంచి.. ఇదే రచ్చ. తండ్రుల నుంచి రాజకీయ వారసత్వం ఎలా తీసుకున్నారో… గొడవల్ని కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్స్ పార్టీ నుంచి పోటీచేసింది కూడా ఈ రెండు కుటుంబాలే కావడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2016లో చనిపోవడంతో… ఉప ఎన్నిక సందర్భంగా మొదలైన గొడవ ఇప్పటికీ ఆగలేదు. ఆ దెబ్బకు.. సింపతీతో సింపుల్‌గా గెలవాల్సిన సీటును కూడా.. ప్రత్యర్థి చేతిలో పెట్టాల్సొచ్చింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కార్‌కి టికెట్ ఇవ్వడంతో.. అలిగి బీజేపీలోకి వెళ్లిపోయారు సంజీవరెడ్డి.
వేర్వేరు పార్టీల నుంచి ఇద్దరికీ తప్పని ఓటమి!
2018లో బీజేపీ నుంచి పోటీ చేసి సంజీవరెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన సురేశ్ షెట్కార్… ఇద్దరూ ఓటమినే మూటగట్టుకున్నారు. ఆ తర్వాత సంజీవరెడ్డి సొంత గూటికి చేరుకున్నా.. వర్గపోరుకు పుల్‌స్టాప్ పడలేదు సరికదా.. మరింత ఎక్కువైంది. ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో.. బీఆర్ఎస్ గెలుపునకు ఈజీగా బాటలు వేస్తున్నారన్న అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వీళ్లిద్దరూ కలిస్తే మాత్రం అధికార పార్టీకి ఇబ్బంది తప్పవంటున్నారు. ఇదే విషయాన్ని.. అధిష్టానం చెప్పినా, కార్యకర్తలు చెప్పినా.. వి డోంట్ కేర్ అన్నట్టుగా.. కలహాల కాపురమే చేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.
జోడో యాత్రలోనూ జోరుగా వర్గపోరు
పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ఇద్దరూ.. వేర్వేరుగా చేస్తున్నారట షెట్కార్, సంజీవరెడ్డి. అవి వాళ్ల కోసం చేస్తున్నారా? పార్టీ కోసం చేస్తున్నారా…? అర్థం కాని పరిస్థితి. ఇటీవల జిల్లాలో జరిగిన రాహుల్ భారత్ జోడో యాత్ర సన్నాహక కార్యక్రమాల్లోనూ… షెట్కార్, సంజీవ్‌రెడ్డిల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు అగ్రనేత పాదయాత్ర చేస్తుంటే.. వీళ్ల అనుచరులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారట. ఇటీవల ధరణి సమస్యలపై పీసీసీ ఇచ్చిన నిరసన కార్యక్రమంలోనూ… ఎవరికివారుగా పాల్గొన్నారట.
గెలిచి నిలిచిన హస్తానికి..
ఇక్కడ కాంగ్రెస్ ట్రాక్‌రికార్డు చూస్తే.. అదరహో అనిపిస్తుంది. 9 సార్లు గెలిచి నిలిచిన హస్తానికి.. హార్డ్ కోర్ క్యాడర్ ఉంది. కానీ, ముందుండి నడిపే నాయకులు.. ఇలా పోట్లాడుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఉంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి… రెండు కుటుంబాలనూ సముదాయించి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా లేదు. దీంతో వీళ్లు మారరు.. మనమే మారాలేమో.. అంటూ తలోదారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నారట కార్యకర్తలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం