MP Komatireddy: నల్గొండ నిరుద్యోగ నిరసన సభపై ఎంపీ కోమటిరెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో సీటు విషయంలోనూ..
నల్గొండ అంటే తనకు ప్రాణం.. అందుకే రానున్న ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 28న నల్లగొండలో జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొంటానని తెలిపారు. పీసీసీ తనను సంప్రదించకుండానే నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టినందున..
Nalgonda Congress: నల్గొండ అంటే నాకు ప్రాణం.. అందుకే రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహిస్తుండగా.. నల్గొండ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో భువనగిరి నుంచి కాదని.. నల్గొండ నుంచి తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తికర పరిణామం. దీనిపై ఉత్తమ్ ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈనెల 28న నల్లగొండలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.
పీసీసీ తనను సంప్రదించకుండానే నల్గొండలో నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టినందున.. ఇందులో పాల్గొనని ఉత్తమ్ గతంలో ప్రకటించారు. దీనిపై ఆయన పార్టీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో శుక్రవారం (ఏప్రిల్ 21న) నల్గొండలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వాయిదాపడింది. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం కోసం చేపట్టిన నిరుద్యోగ నిరసన సభను సజావుగా జరిగేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఆ మేరకు ఏప్రిల్ 28న నల్గొండలో నిరసన సభను నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి ప్రకటించడం నల్గొండ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నల్గొండలో ప్రియాంక గాంధీతో బహిరంగ సభ..
అలాగే జూన్ మొదటి వారంలో నల్లగొండలో ప్రియాంక గాంధీతో బహిరంగ సభ పెడతామని కోమటిరెడ్డి తెలిపారు. ఈ సభతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్‌ల గ్రూపుల గోల లేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బిజెపిలోనే వర్గ పోరు ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండలో 12 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చే స్థానాల్లో నల్లగొండ కూడా ఒకటిగా ఉండబోతుందన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి.. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే తాను ఎక్కువ మెజార్టీ సాధిస్తానన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వస్తున్న వార్తల గురించి తనకు తెలియదని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..