Telangana: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. భార్యాభర్తల పంచాయితీ తీర్చేందుకు వెళితే.. ప్రాణమే పోయింది..!

మాజీ నక్సలైట్, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఎల్లయ్య ప్రత్యర్థులే పథకం ప్రకారం ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు తేల్చారు. హత్య తర్వాత మృతదేహాన్ని విశాఖపట్నం సముద్రంలో పడేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ చారిని అరెస్టు చేయగా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

Telangana: వీడిన మిస్సింగ్ మిస్టరీ.. భార్యాభర్తల పంచాయితీ తీర్చేందుకు వెళితే.. ప్రాణమే పోయింది..!
Vadde Yellaiah
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 02, 2024 | 10:21 AM

మాజీ నక్సలైట్, సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఎల్లయ్య ప్రత్యర్థులే పథకం ప్రకారం ట్రాప్ చేసి హత్య చేశారని పోలీసులు తేల్చారు. హత్య తర్వాత మృతదేహాన్ని విశాఖపట్నం సముద్రంలో పడేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ చారిని అరెస్టు చేయగా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్య సిపిఐ ఎంఎల్ జనశక్తి గ్రూపులో నక్సలైట్ గా పనిచేశాడు. జనజీవన స్రవంతిలో కలిసిన ఎల్లయ్య, ప్రస్తుతం సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసే ఎల్లయ్య పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఎల్లయ్యకు, మరో మాజీ నక్సలైట్ శ్రీకాంతా చారికి మధ్య రియల్‌ ఎస్టేట్‌ భూ వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎల్లయ్యను హతమార్చేందుకు మాజీ నక్సలైట్ శ్రీకాంతా చారి స్కెచ్‌ వేశాడు. భార్యాభర్తల వివాదంలో సెటిల్‌మెంట్ కోసం ఏఫ్రిల్ నెల 18వ తేదీన జగ్గయ్యపేటకు వెళ్లిన ఎల్లయ్య అదృశ్యమయ్యాడు. దీనిపై ఎల్లయ్య కుటుంబ సభ్యులు సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు.

పథకం ప్రకారం ఎల్లయ్యను ట్రాప్..

భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో ముందుండే ఎల్లయ్యను.. ఆ కోణంలోనే ట్రాప్‌ చేయాలని శ్రీకాంతా చారి ప్లాన్ చేశాడు. ఈ పథకంలో భాగంగానే హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్, అపర్ణలను రంగంలోకి దించాడు. జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాస్, తాను ప్రేమించుకున్నామని, ఈ క్రమంలో 20 లక్షల రూపాయలు తీసుకుని శ్రీనివాస్ ముఖం చాటేశాడని అపర్ణ అనే యువతి ఎల్లయ్యను ఆశ్రయించింది. ఈ పంచాయతీ చేసేందుకు ఎల్లయ్యతో అపర్ణ ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

ఈ సెటిల్‌మెంట్ చేసేందుకు అపర్ణతో కలిసి ఎల్లయ్య ఏఫ్రిల్ నెల 18వ తేదీన జగ్గయ్యపేటకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కోదాడలోని తన స్నేహితుడు అంజయ్యను తీసుకుని వెళ్ళాడు. అంతకు ముందే శ్రీకాంతా చారి, అతని స్నేహితుడు శ్రీనివాస్, మరికొందరు మిత్రులు జగ్గయ్యపేటలో అద్దెకు తీసుకున్న ఇంటిలో మకాం వేశారు. ఎల్లయ్య, అపర్ణ, అంజయ్య జగ్గయ్యపేటకు రాగానే, శ్రీనివాస్‌‌కు ఫోన్‌ చేశాడు. ఒంటరిగా వస్తే సెటిల్‌మెంట్ చేసుకుని డబ్బులు ఇస్తానని ఎల్లయ్యకు శ్రీనివాస్ చెప్పాడు. దీంతో తనతో పాటు వచ్చిన అపర్ణ, స్నేహితుడు అంజయ్యలను జగ్గయ్యపేట బస్టాండ్ వద్ద వదిలి శ్రీనివాస్ చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఎల్లయ్య వెళ్లిన తర్వాత తనతోపాటు ఉన్న అపర్ణ కూడా అదృశ్యం కావడంతో అంజయ్య ఆందోళన చెందాడు. ఎల్లయ్య ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానించిన అంజయ్య వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎల్లయ్య సోదరుడు…

ఎల్లయ్య సోదరుడు సతీశ్‌ సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులకు ఎల్లయ్య మిస్సింగ్ ఫై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేత కావడంతో, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. తొమ్మిది బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాంతా చారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో హత్య మిస్టరీ వీడింది. ఏఫ్రిల్ నెల 18న ఎల్లయ్యను జగ్గయ్యపేటలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌లో శ్రీకాంతా చారి తన అనుచరులతో ఎల్లయ్యను హతమార్చాడు. మృతదేహాన్ని చేపలను పార్సిల్‌ చేసే బాక్సులో పెట్టి, విశాఖకు తరలించారు.

అక్కడే మృతదేహంతో పాటు వినియోగించిన ఫోన్లు, సిమ్ కార్డులు సముద్రంలో పడేయాలని సూచించినట్లు శ్రీకాంతా చారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఎల్లయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంతా చారిని అరెస్టు చేసిన పోలీసులు, మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

నిందితుడు శ్రీకాంతా చారిపై ఇప్పటికే 34 కేసులు ఉన్నాయని, నల్గొండలో హత్య చేస్తే పోలీసులకు దొరికిపోతానని జగ్గయ్యపేటను ఎంచుకున్నట్లు పోలీసులు వివరించారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తనను హత్య చేస్తానని ఎల్లయ్య హెచ్చరించడంతోనే అడ్డు తొలగించుకునేందుకు శ్రీకాంతా చారి స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. మృతదేహం కూడా గల్లంతు కావడంతో ఏపీ, తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…