Blood Shortage: కరోనా విజృంభణతో పొంచి ఉన్న మరో ముప్పు… తగ్గుతున్న రక్తం నిల్వలు..!

కరోనా సెకండ్ వేవ్ దండయాత్రలో మరో ముప్పు దేశానికి ఎదురుకాబోతోంది. త్వరలో రక్తం నిల్వల్లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

Blood Shortage: కరోనా విజృంభణతో పొంచి ఉన్న మరో ముప్పు... తగ్గుతున్న రక్తం నిల్వలు..!
Blood Shortage Ahead Of Mass Vaccination
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 29, 2021 | 3:53 PM

Blood Shortage: కరోనా సెకండ్ వేవ్ దండయాత్రలో మరో ముప్పు దేశానికి ఎదురుకాబోతోంది. త్వరలో రక్తం నిల్వల్లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న దగ్గర నుంచి 60 రోజుల పాటు.. రక్తదానం చేయడానికి అవకాశం లేదు. ఇది తెలుగు రాష్ట్రాల్లోని రక్తం నిల్వలపై భారీగా ప్రభావం చూపనుంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకూ వేల మందికి ఆక్సిజన్ అవసరం అవుతోంది. ఆస్పత్రుల్లో బెడ్ల సౌకర్యం కల్పించలేక.. ప్రభుత్వాలు, అధికారలు తలమునకలు అవుతున్నారు. ఇలాంటి సమయంలో మరో కొత్త సమస్య వెంటాడబోతోంది. రాబోయే రోజుల్లో రక్తం అందక.. తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ముంచుకొస్తోంది. రక్త దాతలు ఇదివరకు లాగా ముందుకు రాకపోవడం.. ఇవ్వడానికి ముందుకు వచ్చినా కొంత మందికి అవకాశం లేకపోవడం రక్త సేకరణకు అడ్డంకిగా మారబోతోంది.

సాధారణంగా యువకులు, మధ్య వయస్కులు ఎక్కువగా రక్తదానం చేస్తుంటారు. కానీ, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒకసారి టీకా వేయించుకుంటే 60 రోజుల పాటు రక్తదానం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే లాస్ట్ డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాతనే రక్తదానం చేయడానికి అర్హులు.

ఇప్పటికే కొవిడ్‌ కారణంగా రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. రోజు రోజుకు రక్తం అవసరం అయ్యే వారి సంఖ్య పెరుగుతుండగా.. అందుకు తగ్గట్లుగా సేకరణ ఉండడం లేదు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆస్పత్రులకు వచ్చే క్షతగాత్రులకు రక్తం ఎక్కువగా అవసరమవుతుంది. ఇటువంటి కేసుల్లో ఒక్కరికే 3, 4 యూనిట్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే, హైరిస్కు ప్రెగ్నెన్సీ, న్యూరో సర్జరీలతో పాటు తలసేమియా, సికిల్‌ సెల్‌ రోగులకు రక్తం అవసరం ఉంటుంది. రాబోయే 40 రోజుల్లో రక్తానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకి, తగ్గిన వారి నుంచి వెంటనే రక్తం తీసుకోవడం లేదు. కనీసం 3 నెలలు ఆగాలని వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నామని, రక్తదానం చేస్తే మరింత బలహీనమవుతామన్న వైరస్‌ సోకిన తగ్గిన వారిలో కొంత మంది భావిస్తున్నారు. రక్తదానం చేసేందుకు కొవిడ్‌ టెస్టు తప్పనిసరి అంటూ నిబంధన పెట్టారు. ఇది కూడా రక్త దాతలు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 132 బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధ్వర్యంలో 19, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో 15 బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. గతంలో ఏటా 2.10 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించేవారు. ప్రస్తుత డిమాండ్‌ ప్రకారం ఏడాదికి 1.20 లక్షల యూనిట్లు అవసరం ఉండగా.. 92వేల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించగలిగామని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో రక్తం నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో.. ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మరోవైపు 18 ఏళ్లుపైబడిన వారందరికీ వచ్చే నెల 1 నుంచి వ్యాక్సిన్‌ వేయనున్న నేపథ్యంలో.. ఆలోపే వీలైనంత ఎక్కువ రక్తం సేకరించాలని వైద్య శాఖ లక్ష్యంగా పెట్టుకొంది.

మహమ్మారి వ్యాప్తి చెందిన తొలినాల్ల నుంచీ రక్త నిధి కేంద్రాలకు ఈ మహమ్మారి సెగ తగిలింది. అయినా కొందరు ఔదార్యంతో ముందుకు వచ్చి రక్త దానం చేయడంతో ఆ కొరత నుంచి గట్టేక్కుతూ వస్తున్నాం. అయితే, శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరత ఏర్పడింది. జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులేంటి? ఆ కొరతను తీర్చేందుకు రక్త నిధి కేంద్రాల నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయవాడలోనూ గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం రక్త నిల్వలు సగానికిపైగా పడిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం దొరికుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది.

Read Also…. Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..? టీకాలపై జీఎస్టీ తొలగించే అవకాశం