AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తాం.. పొత్తులపై కాంగ్రెస్‌కు సీపీఎం మరోసారి డెడ్‌లైన్..

ఈరోజే లాస్ట్‌! లెఫ్టా..రైటా..? ముందుకా..వెనక్కా..? ఇలా ఎటూ తేలడం లేదు తెలంగాణలో కాంగ్రెస్‌-వామపక్షాల పొత్తు కథా చిత్రమ్. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూడా..లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు చర్చలు కొలిక్కి రావడం లేదు. తాము విధించిన గడువు ముగిసినా కూడా కాంగ్రెస్‌ నుంచి స్పందన రాకపోవడంతో సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో ఇటు లెఫ్ట్‌ పార్టీల్లోనూ..అటు హస్తం పార్టీలోనూ సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Telangana Elections: మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తాం.. పొత్తులపై కాంగ్రెస్‌కు సీపీఎం మరోసారి డెడ్‌లైన్..
Communist Leaders
Sanjay Kasula
|

Updated on: Nov 02, 2023 | 10:35 AM

Share

లెఫ్ట్‌పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు అంశం తేలడం లేదు. తాము విధించిన గడువు ముగిసినా కూడా కాంగ్రెస్‌ నుంచి స్పందన రాకపోవడంతో సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి డెడ్‌లైన్‌ విధించారు..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మధ్యాహ్నం 3గంటల వరకు కాంగ్రెస్‌ నిర్ణయం కోసం చూస్తామని..లేదంటే అభ్యర్ధులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

కూటమి ధర్మం పాటించకపోతే నష్టపోయేది కాంగ్రెస్సే అంటున్నారు సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి. వామపక్షాలను కాదనుకుంటే తెలంగాణలో అధికారం దక్కదని హెచ్చరించారు. మరోవైపు సీపీఐ మాత్రం తమ ప్రయాణం కాంగ్రెస్‌తోనేనని చెబుతోంది. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం నుండి తమకు స్పష్టమైన భరోసా ఉందంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొత్తగూడెం, బెల్లంపల్లి సీట్లు తాము కోరామని అయితే బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరినా కూడా తమ సీటుకు వచ్చిన ఇబ్బంది లేదన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌…అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకు దిగింది. దీంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. అందుకు కాంగ్రెస్‌ కూడా సరేనంది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్ వేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి / అబ్బాయిని లేపుకుపోయినట్టు రాజకీయాల్లో జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరుపై నారాయణ ఈ తరహా విమర్శలు చేయడం గమనార్హం. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వెనక్కి తగ్గడంపై నారాయణ అసహనం వ్యక్తం చేశారు.

చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది. ఇప్పుడు వాటిపై కూడా క్లారిటీ రాకపోవడంతో లెఫ్ట్‌పార్టీల్లో అసంతృప్తి నెలకుంది. దీంతో ఒంటరి పోరుకు సీపీఎం మొగ్గుచూపుతుండగా..సీపీఐ మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుంది. మరేం జరుగుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి