CM KCR Lockdown Review: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం.. లాక్‌డౌన్‌ మరింత క‌ఠినంగా అమ‌లు చేయాలిః సీఎం కేసీఆర్

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.

CM KCR Lockdown Review: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం.. లాక్‌డౌన్‌ మరింత క‌ఠినంగా అమ‌లు చేయాలిః సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: May 21, 2021 | 8:15 PM

CM KCR Lockdown Review: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. అయితే రైతన్నకు వెన్నుదన్నగా వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం కలగనివ్వద్దని సూచించారు. మరికొన్ని రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న దృష్ట్యా ధాన్యం సేకరణ మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కరోనాతో తల్లడిల్లుతున్న బాధితులను పరామర్శించేందుక ఇవాళ వరంగల్ పట్టణంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. మొదట ఎంజీఎం ఆసుపత్రిని సదర్శించారు. ఐసీయూ, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుంటారనీ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎం ను ఉద్దేశించి, మీరే మా ధైర్యం.. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.

మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారకుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి అభ్యర్థనలను స్వీకరించారు. అక్కడ మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే, విశాలమైన స్థలంలో చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు మాదిరిగా.. జైలును నిర్మిస్తుందనీ సీఎం తెలిపారు.

అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఎం.. డీజీపీ, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణపై చర్చించారు. వైరస్ విజృంభణను నియంత్రించేందుకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు జరగక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదని, వెంటనే ఈ జిల్లాలకు స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ రాష్ట్ర రెవెన్యూ నష్టం గురించి ఆలోచించకుండా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజమెంట్ చట్టం నియమ నిబంధనల ప్రకారం, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీతో సహా కలెక్టర్లకు ఉందన్నారు. ఉదయం సడలించిన 4 గంటలు మినహా, మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, అత్యవసర సేవలను, పాస్‌లు ఉన్నవాళ్లను మినహాయించి, ఇతరులపట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దన్నారు. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సీఎం సూచించారు.

అలాగే, కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం కోరారు.రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ర్పెడర్స్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయాల వ్యాపారులు, సేల్స్ మెన్ తదితరులందరినీ గుర్తించి జాబితాను రూపొందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వీరందరికీ వ్యాక్సినేషన్ చేసే విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు.

Read Also…  KCR : నేటితో పూర్తైన తొలి విడత ఫీవర్ సర్వే.. ప్రధాన ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పూర్తిస్థాయి లైటింగ్ ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశం