CM KCR: దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం మనదే కావాలి.. కొండగట్టుకు మరో రూ.500 కోట్లు..
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ. 100 కోట్లు ఇవ్వగా మరో రూ. 500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ముఖ్యంమంత్రి కే.చంద్రశేఖర్ రావు కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. కొండగట్టుకు అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు ఇవ్వగా.. మరో రూ.500 కోట్లు ప్రకటించడంతో మొత్తం రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొండగట్టు బృహత్తర ప్రాజెక్ట్ లో భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే.. కొండగట్టు అనే పేరు రావాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
హనుమాన్ జయంతి దేశంలోనే గొప్పగా కొండగట్టులో జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వేలాది మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలన్నారు. ఆలయంలో పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణిని అభివృద్ధి చేయాలని సూచించారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారన్నారు.
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కొండగట్టుకు మళ్ళీ వస్తానని ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..