Hyderabad: తెలంగాణలో గర్భిణీలకు గుడ్ న్యూస్.. న్యూట్రిషన్ కిట్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు 'కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను' ప్రవేశపెట్టింది. నిజానికి ఈ పథకం ఇప్పటికే తెలంగాణలో 9 జిల్లాల్లో ప్రారంభంకాగా తాజాగా..
మహిళ, శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను’ ప్రవేశపెట్టింది. నిజానికి ఈ పథకం ఇప్పటికే తెలంగాణలో 9 జిల్లాల్లో ప్రారంభంకాగా తాజాగా రాష్ట్రమంతా అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా న్యూట్రిషన్ కిట్లను అందించారు.
గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ కిట్లను తొలుత ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అందించగా ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేస్తామని తెలిపారు. ఇక ఈ కిట్ విలువ రూ. 2 వేలుగా ఉంటుంది. ఈ కిట్స్‌లో న్యూట్రిషన్ మిక్స్‌డ్ పౌడర్ (హార్లిక్స్) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున), ఖర్జూర ఒక కిలో.. నెయ్యి 500 గ్రాములు, ఐరన్ సిరప్ 3 బాటిళ్లు, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లతో పాటు ఒక కప్పు ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ అందించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించింది. న్యూట్రీషన్ కిట్‌తో పోషకాహార లోపం తగ్గడంతో పాటు, సిజేరియన్లు తగ్గుతాయని, మాతాశిశు మరణాలను నియంత్రించవచ్చని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..