Ayodhya: అయోధ్య గడ్డపై తెలంగాణం.. రామయ్య చెంత చిందు యక్షగానం
Chidu Yaksha Ganam: బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కోసం ముస్తాబవుతున్న అయోధ్యానగరిలో తెలంగాణం వినిపిస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన వైవిధ్య కళానాటకరూపకం 'చిందు యక్షగానం' ప్రదర్శనలతో అయోధ్యానగరం మార్మోగుతోంది. పండుగ శోభను సంతరించుకున్న అయోధ్యలో భరతఖండంలోని అన్ని ప్రాంతాల సంస్కృతి..
Chidu Yaksha Ganam: బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కోసం ముస్తాబవుతున్న అయోధ్యానగరిలో తెలంగాణం వినిపిస్తోంది. అవును.. మీరు చదివింది నిజమే. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన వైవిధ్య కళానాటకరూపకం ‘చిందు యక్షగానం’ ప్రదర్శనలతో అయోధ్యానగరం మార్మోగుతోంది. పండుగ శోభను సంతరించుకున్న అయోధ్యలో భరతఖండంలోని అన్ని ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు, కళారూపాలను ప్రదర్శించేలా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా తెలంగాణ నుంచి చిందు యక్షగానాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. దాదాపు అంతరించిపోయిన స్థితిలో ఉన్న ఈ అపురూప కళకు మళ్లీ జీవం పోస్తున్న గడ్డం సమ్మయ్యకు ఈ అదృష్టం వరించింది. మకర సంక్రాంతి రోజు అయోధ్యలో అడుగుపెట్టిన సమ్మయ్య బృందం రామాయణ ఇతిహాసంలో వివిధ ఘట్టాలపై చిందు యక్షగానం ప్రదర్శనలు ఇస్తోంది. సరయూ నదీతీరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలతో మార్మోగుతుంటే.. తులసీ ఉద్యాన్ ప్రాంతం జానపద కళారూపాల ప్రదర్శనలతో మంత్రముగ్దులను చేస్తోంది.
‘చిందు యక్షగానం’ అంటే…!
దేశంలోని అనేక జానపద కళారూపాల్లో యక్షగానం ఒకటి. యక్షగానం కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కళారూపం. కానీ తెలంగాణలో మాత్రమే కనిపించే చిందు యక్షగానం కర్ణాటక కళారూపకానికి కొనసాగింపుగా కొన్ని మార్పు, చేర్పులతో ఉంటుంది. సాధారణ యక్షగానంలో నృత్యం, సంగీతం, అభినయం, నాటకం కలగలిపి ఉంటాయి. కళాకారులు ఈ ప్రదర్శనలో భాగంగా ఆట, పాట, డ్యాన్స్, డైలాగ్స్ అభినయిస్తూ మరీ చెబుతుంటారు. ఇది జానపద కళారూపం కాబట్టి పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అర్థమయ్యే భాషలోనే కళారూప ప్రదర్శన ఉంటుంది. ఈ యక్షగానానికి అదనంగా ‘చిందు’ను చేర్చడంతో తెలంగాణ కళారూపం చిందు యక్షగానంగా పేరొందింది. చిందు అంటే ఎగిరి గంతులేయడం. తెలంగాణ యక్షగానంలో నృత్యం, సంగీతం, నాటకం, అభినయాలను మధ్య మధ్యలో ఎగిరి గంతులేస్తూ వీక్షకులను ఉత్సాహపరిచేలా ఉంటుంది.
అందుకే చిందు యక్షగానంగా పేరొచ్చింది. ఇందులో భాగంగా ప్రదర్శించే కథలు, కథనాలన్నీ రామాయణ, మహాభాగవతాలవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. దీన్ని వ్యావహారిక భాషలో ‘చిందు భాగవతం’ అని కూడా పిలుస్తుంటారు. ఈ కళ క్రీస్తుపూర్వం 2 శతాబ్దం నుంచి ఉందని చెప్పేందుకు చారిత్రక ఆధారాలున్నాయి. ఇంత ఘన చరిత్ర కల్గిన జానపద కళారూపం ఇప్పుడు అంతరించిపోతున్న కళల జాబితాలో చేరింది. ఇందుక్కారణం ఆధునిక యుగంలో సినిమాలు, టీవీలు వచ్చిన తర్వాత జానపద కళారూపాలకు ఆదరణ తగ్గింది. దీంతో వారి ఉపాధి కూడా తగ్గిపోయింది. అనివార్యంగా ఈ కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులు ఇతర పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
పునర్జన్మనిస్తున్న గడ్డం సమ్మయ్య
అంతరించిపోతున్న స్థితిలో ఉన్న ఈ కళను పరిరక్షించేందుకు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన గడ్డం సమ్మయ్య నడుం బిగించారు. చిందు యక్షగానం కళను తమ కులవృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తున్న సామాజికవర్గంలో జన్మించిన ఆయన, వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న కళను బ్రతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 19 వేలకు పైగా ప్రదర్శనలు, లెక్కలేనన్ని రేడియో షోలు ఇచ్చారు. అలా అంతరించిపోతున్న కళకు గడ్డం సమ్మయ్య ప్రాణం పోస్తున్నారు. కళ తనతోనే ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో కొత్త తరానికి కూడా శిక్షణనిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం కావాలని కోరుతున్నారు. ఈ కళను గుర్తించి ప్రోత్సాహం అందించాలని, అలాగే కళాకారులకు ఉపాధి లేదా జీవనభృతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయోధ్యలో రామజన్మభూమిలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తమకు ఆహ్వానం అందడం అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా తమ కళను యావద్దేశ ప్రజలకు ప్రదర్శించే అరుదైన అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని, ఈ సందర్భంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు తమ కళను బ్రతికించేందుకు తోడ్పాటు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి