Medaram Jathara: మేడారం మహాజాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహిళా మంత్రులు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మేడారం మహాజాతరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క - సురేఖ అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సీతక్క అక్కడే తిష్టవేసి అన్నీ తానై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం ఇద్దరు మంత్రులు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకొని అభివృద్ది పనులను పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మేడారం మహాజాతరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క – సురేఖ అభివృద్ది పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సీతక్క అక్కడే తిష్టవేసి అన్నీ తానై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం ఇద్దరు మంత్రులు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకొని అభివృద్ది పనులను పరిశీలించారు. జాతరకు వచ్చే మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తేల్చి చెప్పారు. మేడారం మహాజాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ముందుగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభివృద్ది పనులను పరిశీలించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.75కోట్ల నిధులు మంజూరీచేసింది. జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న ప్రభుత్వం తగిన అభివృద్ది పనులు చేపట్టింది. ఈ పనుల విషయంలో నాణ్యతపై రాజీపడేది లేదని మంత్రులు సీతక్క, సురేఖ అధికారులను హెచ్చరించారు. మేడారం ప్రాంతంలో గత జూలైలో సంభవించిన వరదల కారణంగా భారీనష్టం వాటిల్లిందని, వాటి కోసం మేడారం నిధులతో అభివృద్ది పనులు జరుపుతున్నామని అన్నారు. భిన్నాభిప్రాయాలు లేకుండా అందరు సహకరించి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. అభివృద్ది పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించేలా అధికారులు చూడాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు వంత పాడే అధికారులపై కఠినచర్యలు చేపడుతామని మంత్రులు హెచ్చరించారు.
వరంగల్ ఆడబిడ్డలుగా మాకు మంత్రి పదవులు దక్కడం అదృష్టమని, ఇద్దరం కలిసి జాతరను విజయవంతం చేసేందుకు సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో కలిసి పని చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ది పనులన్నింటిని 100 శాతం మేరా నెలాఖరు వరకు పూర్తి చేస్తామని తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూస్తూ అధికారుల వెంట పడి పరిగెత్తించి పనులు పూర్తి చేయిస్తామని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంటుందని.. మేడారం జాతరకు వచ్చే మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని మంత్రులు సూచించారు. జనవరి 30 లోపు జాతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారంకు వచ్చే అన్ని రహదారుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా మేడారం జాతరకు ప్లాస్టిక్ రహితజాతరగా నిర్వహించడంలో ప్రతిఒక్కరూ సహకరించాలని క్లాత్ బ్యాగ్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..