Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: అసత్య ప్రచారాలు మానుకోండి.. టీఆర్ఎస్ నాయకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి విపత్తు సహాయనిధిని NDRF నుంచి కేటాయించలేదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నాయకులు మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు

Kishan Reddy: అసత్య ప్రచారాలు మానుకోండి.. టీఆర్ఎస్ నాయకులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్..
Kishan Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2022 | 8:28 PM

Kishan Reddy on TRS Leaders: ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కోసం గత 8 సంవత్సరాలలో దాదాపు 3,000 కోట్లను, 2018 నుంచి నేటి వరకు 1,500 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి విపత్తు సహాయనిధిని జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నుంచి కేటాయించలేదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నాయకులు మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చిన సమయంలో, ఇప్పుడు 2022 లో గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ‘‘విపత్తులు సంభవించిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం ఆమోదించిన అంశాలు, నిబంధనలకు అనుగుణంగా ఇది వరకే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) నందు ఉంచిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను చేపడతాయి. తీవ్రమైన విపత్తులు సంభవించిన నేపథ్యంలో, కేంద్ర బృందాలు సందర్శించి రూపొందించిన అంచనాల ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి అదనపు నిధులను ఆయా రాష్ట్రాలకు అందించడం జరుగుతుంది.’’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 46 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ నిధి అనేది తీవ్రమైన విపత్తులు సంభవించినపుడు రాష్ట్రాల రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి(SDRF) నందు సరిపడినన్ని నిధులు లేకపోతే, అవసరమైన అదనపు నిధులను కేటాయించడానికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి విపత్తు సంభవించినపుడు విపత్తు సహాయక చర్యలను సిద్ధం చేయడం, పునరుద్ధరణ, పునః నిర్మాణం, ఉపశమనం వంటి అంశాలకు నిధులు సమకూర్చడం జాతీయ విపత్తు నిర్వహణ నిధి కిందకు రాదు. తీవ్రమైన విపత్తు సంభవించినపుడు, సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన ఖర్చు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి అకౌంటు నందు ఉన్న నిధుల కంటే ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే, జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి నిబంధనల ప్రకారం అవసరమయిన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి రు. 599 కోట్లను కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా రు.449 కోట్లు. ఈ నిధులను రు.224.50 కోట్లు చొప్పున రెండు విడతలుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి(SDRF)కి జమ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నందు రు.1,500 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. అందులో దాదాపు రు.1,200 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఉన్నాయి. ఈ నిధులు 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల వలన నష్టపోయిన వారికి అవసరమైన సహాయాన్ని అందించటానికి సరిపోతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాల వలన నష్టపోయిన కౌలు రైతులతో సహా రైతులందరికీ కూడా అవసరమైన సహాయాన్ని అందించడానికి కూడా ఈ నిధులు సరిపోతాయి.. అని కిషన్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి

2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి రు.479.20 కోట్లు కేటాయించగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు రు.359.20 కోట్లు. గత సంవత్సరంలాగే ఇప్పుడు కూడా రు.179.60 కోట్లు చొప్పున రెండు విడతలుగా ఈ నిధులను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి జమ చేయడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2014-15 నుండి గత 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన SDRF & NDRF నిధుల మొత్తాన్ని సంవత్సరం వారీగా కింది పట్టికలో పొందుపరచడం జరిగిందని తెలిపారు.

2014 నుంచి NDRF ద్వారా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు + SDRF నకు జమచేసిన కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు (రు. కోట్లలో)

  • 2014-15 172.41
  • 2015-16 673.70
  • 2016-17 544.16
  • 2017-18 58.40
  • 2018-19 226.50
  • 2019-20 487.50
  • 2020-21 449.00
  • 2021-22 359.20
  • 2022-23 377.60*
  • విడుదల చేసిన మొత్తం నిధులు 2970.87

విడుదల చేయవలసిన కేంద్ర ప్రభుత్వం వాటా నిధులు..

ప్రస్తుత సంవత్సరం రాష్ట్రాలకు కేటాయించిన SDRF నిధుల విడుదల అనేది, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో గత సంవత్సరం ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన పత్రాలను, వార్షిక నివేదికలను అందించటం మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం SDRF కు కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల కింద రు.377.60 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ నిధుల విడుదల అనేది, రాష్ట్రంలో గత సంవత్సరం ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన పత్రాలను, వార్షిక నివేదికలను, ఇతర పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం మీద ఆధారపడి ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. NDRF నుంచి నిధులను విడుదల చేయడానికి ఒక నిర్ధిష్టమైన పద్ధతి ఉంటుందని గ్రహించి, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

విపత్తు నిర్వహణ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఉన్న ఈ అవగాహనా లోపం, కోవిడ్ సమయంలో భారత ప్రభుత్వం అందించిన సహాయాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడంలో కూడా కనిపిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులపై CAG జరిపిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం “SDRF అకౌంట్ నందు రు. 977.67 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్ నిధులు ఉన్నాయి. ఈ నిధుల నుండి రు.397.11 కోట్లు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రు.21.03 కోట్లను మాత్రమే SDRF నుండి ఉపయోగించుకోవడం జరిగింది. ఇందులో భారత ప్రభుత్వ వాటా రు.282 కోట్లు”. అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం సంభవించిన గోదావరి వరదల విషయంలో అవసరమైన సహాయ సహకారాలను అందించటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పూర్తి సంసిద్ధతను ఇదివరకే వ్యక్తం చేసిందని కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..