Palamuru–Rangareddy Project: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాపై కేంద్రం కీలక ప్రకటన..
తెలంగాణకు కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–II పరిధిలో ఉండటంతో ఈ వ్యవహారం న్యాయ విచారణలో ఉందని కేంద్రం తెలిపింది.

తెలంగాణకు కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ సోమవారం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యత కలిగినవి, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో ముడిపడినవి, గణనీయమైన సాగునీటి సామర్థ్యాన్ని సృష్టించే లేదా పునరుద్ధరించే భారీ సాగునీటి ప్రాజెక్టులకు PMKSY-AIBP, జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. అయితే, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశం భారత ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టంగా పేర్కొంది.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత సాగునీటి సామర్థ్యం ఏర్పడుతుంది, కరువు నివారణకు ఎంత ప్రయోజనం కలుగుతుంది, తాగునీటి ప్రయోజనాలు ఏమిటి, ప్రాజెక్టుకు ఎంత కేంద్ర ఆర్థిక సహాయం అందించవచ్చని రేణుకా చౌదరి ప్రశ్నించినప్పటికీ, ఈ అంశాలపై నిర్దిష్టమైన వివరాలు, కేంద్ర సహాయం మొత్తాన్ని కేంద్రం తన సమాధానంలో వెల్లడించలేదు.
కృష్ణా జలాల వివాదమే కీలక అడ్డంకి..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర జల సంఘం కు అందిందని కేంద్రం తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాల వినియోగంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–II (KWDT-II) Terms of Reference పరిధిలో ఉండటంతో వ్యవహారం ప్రస్తుతం న్యాయ విచారణలో (sub-judice) ఉందని వెల్లడించింది. ఈ కారణంగా ప్రస్తుత దశలో PRLISకు అవసరమైన టెక్నో–ఎకనామిక్ అప్రైజల్ నిర్వహించలేమని స్పష్టం చేసింది.
డిపిఆర్ ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపిన కేంద్రం
ప్రాజెక్టు ద్వారా ఉద్దేశించిన ప్రయోజనాలు సాధించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచిస్తూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం DPRను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు కేంద్రం తెలిపింది. సాధారణంగా కేంద్ర ఆర్థిక సహాయం కోసం ఒక సాగునీటి ప్రాజెక్టును పరిశీలించాలంటే ముందుగా CWC సాంకేతిక పరిశీలన, ఆ తర్వాత జలవనరుల శాఖ అడ్వైజరీ కమిటీ ద్వారా టెక్నో–ఎకనామిక్ అప్రైజల్ పూర్తి కావడం తప్పనిసరని వివరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
